Irrigation: వచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లు అందించాలి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Ramesh Goud |
Irrigation: వచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లు అందించాలి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జున సాగర్ డ్యామ్‌ను పటిష్టం చేసేందుకు, డ్యామ్ మీద పడిన గుంటల పూడ్చివేతకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అందుకు గాను ఐఐటీ రూర్కీ వారి ఆధ్వర్యంలో అధ్యయనం జరపాలని ఆయన నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని నెల్లికల్లు ఎత్తిపోతల పధకంతో సహా హైలెవల్, లోలెవల్, లింక్ కెనాల్ లతో పాటు నాగార్జునసాగర్ డ్యామ్ మీద పడిన గుంటల పూడ్చివేత లకు సంబంధించి మంగళవారం జలసౌధలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ నెల్లికల్ ఎత్తిపోతల పధకం ఫెజ్-1 పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు పనులు ముమ్మరం చేయాలన్నారు.

వచ్చే ఖరీఫ్ నాటికీ నీళ్లు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటిని అందించే నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 664.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ ఎత్తిపోతల పధకం పూర్తి అయితే 24,624 ఎకరాల ఆయకట్టును సేద్యంలోకి వస్తుందన్నారు. ఖరీఫ్ సీజన్ నాటికి మొదటి దశ పూర్తి అయితే 7,600 ఎకరాలకు నీరందించవచ్చన్నారు. అంతే గాకుండా హైలెవల్,లోలెవల్ కెనాల్ ల మధ్యలో చేపట్టిన లింక్ కెనాల్ పనులను వేగిరపరచాలన్నారు.15 కిలోమీటర్ల పరిధిలో 62.26 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ కాలువ నిర్మాణం కోసం కావలసిన 65.02 ఎకరాలకు గాను ఇప్పటికే 43.31 ఎకరాల భూమిని సేకరించినట్లు ఆయన తెలిపారు.

త్వరితగతిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. చివరి భూముల వరకు నీరు అందేలా ఏయంఆర్ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ల పరిధిలోని 90.43 కిలోమీటర్ల మేర కాలువలను 42.26 కోట్ల వ్యయంతో 60 మిల్లీమీటర్ల మేర కాంక్రీట్ లైనింగ్ తో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.సాగర్ ఆయకట్టు పరిధిలోని 39 ఐడిసి ఎత్తిపోతల పధకాలలో ఎక్కువ భాగం పనిచేయడం లేదని,పనిచేయని వాటిని గుర్తించి మరమ్మతులకు అయ్యే వ్యయం తాలూకు అంచనాలు రూపొందించిన సత్వరమే పునరుద్ధరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనుమల చెక్ డ్యామ్ నిర్మాణానికి పాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి, మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి, నీటిపారుదల శాఖా ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,ఆర్అండ్ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇఎన్సి అనిల్ కుమార్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Advertisement

Next Story