Ap News: ముందస్తు యోచనలో జగన్.. అక్టోబర్‌లో కేబినెట్ రద్దు..?

by srinivas |   ( Updated:2023-06-01 10:28:55.0  )
Ap News: ముందస్తు యోచనలో జగన్.. అక్టోబర్‌లో కేబినెట్ రద్దు..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందా? విపక్షాల దూకుడు, నిధుల సమీకరణల ఇబ్బందులతో వైసీపీ ప్రభుత్వం ముందస్తుకు సై అంటోందా? మరి టీడీపీ సైతం సై అంటోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కేంద్రం సైతం సీఎం జగన్‌కు భరోసా ఇచ్చిందని తెలుస్తోంది. కేంద్రం సహకారంతోనే సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నవంబర్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉంది. ఇదే తరుణంలో అసెంబ్లీని రద్దు చేస్తే బెటర్ అనే ఆలోచనలో వైసీపీ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ ఏడాది అక్లోబర్‌లో అసెంబ్లీ రద్దు చేస్తే మిగిలిన ఐదు రాష్ట్రాలతోపాటే ఎన్నికలకు వెళ్లాలనే భావనలో ఉన్నట్లు ప్రచారం. అక్టోబర్ తప్పితే మరో ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తుకు సమయం పడుతుంది. ఇంతలో రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తుంది. వీటన్నింటిని అధిగమించాలంటే ముందస్తే మేలు అని సీఎం వైఎస్ జగన్ భావనలో ఉన్నారనే ప్రచారం అయితే విపరీతంగా జరుగుతుంది. ఈనెల ఏడున జరగబోయే కేబినెట్ భేటీలో ఈ అంశంపై ఏదో ఒక క్లారిటీ రానుందని తెలుస్తోంది.

ముందస్తుకు కారణాలివేనా?

వైసీపీ ప్రభుత్వం పరిస్థితి దారుణంగా ఉంది. ఏం చేయాలన్నా అప్పు చేయక తప్పనిసరి పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు దగ్గర నుంచి ఉద్యోగాలకు జీత భత్యాల చెల్లింపులు వరకు అన్నింటికి అప్పులు మీదే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. రిజర్వ బ్యాంక్ దగ్గర ఆస్తులు తనఖాలు పెట్టి మరీ అప్పులు తెచ్చి ప్రభుత్వం నెట్టుకొస్తుంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వానికి ఈ అప్పులు మరింత భారంగా మారాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం అప్పులపై ఆంక్షలుసైతం విధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అప్పుల పరిమితి ఆరు నెలల వరకే కేంద్రం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆరునెలల అనంతరం నిధుల సమీకరణ ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది. అంతేకాదు మరో ఆరు నెలలపాటు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా నిధుల కోసం వేటాడాల్సిన పరిస్థితి. అదే సమయంలో ఎన్నికల వేడి సైతం రాజుకుంటుంది. ఈ అప్పులు విపక్షాలకు ఒకఆయుధంగా మారే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ముందస్తుకు వెళ్తేనే మంచిదని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు ఎన్నికలకు అటు టీడీపీ ఇటు జనసేన మరోవైపు విపక్షాలు సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలా? ఒంటరిగా వెళ్లాలా అన్నదానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పొత్తులు, ఎత్తులపై ఎలాంటి క్లారిటీ రాకుండానే ఎన్నికలకు వెళ్తే ఆ పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేసినట్లు వైసీపీ భావిస్తోంది.

జగన్‌కు కేంద్రం భరోసా

రాష్ట్రంలో ప్రతిపక్షాలు దూకుడు పెంచుతున్నాయి. అంతేకాదు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ వారికి అడ్డుకట్టవేసి వచ్చే మళ్లీ సీఎం పీఠంపై కూర్చోవాలని నిర్ణయించుకున్నారు. ఇతర పార్టీలకు అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా ముందస్తుకు వెళ్లడమే మంచిదని వైసీపీ భావిస్తోంది. ముందస్తు ఎన్నికలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి. కేంద్రం అంగీకరించకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తుంది. ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితులు రాకుండా సీఎం జగన్ అప్రమత్తమైనట్లుతెలుస్తోంది. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో కేంద్రం వద్ద అసెంబ్లీ రద్దు అంశంపై చర్చించారనే ప్రచారం జరుగుతుంది. అందుకు కేంద్రం సైతం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టుకోవాలో అనేది మీ ఇష్టం అంటూ సీఎం జగన్‌కు ఫ్రీ హేండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మేము సైతం అంటున్న టీడీపీ

ఇకపోతే ముందస్తు ఎన్నికలకు టీడీపీ సైతం సిద్ధం అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని గద్దె దించి గాడితప్పిన ఏపీని సరైన గాడిలో పెట్టడమే తమ లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు. గత కొంతకాలంగా టీడీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడమే కాదు ముచ్చెమటలు పట్టిస్తుందని రాజకీయ వర్గాల్లోప్రచారం ఉంది. ఒకవేళ టీడీపీ-జనసేన పొత్తుతో కలిసి ఎన్నికలకు వెళ్తే పార్టీకి ఇబ్బందులు తప్పవనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి తరుణంలో అటు టీడీపీ ఇటు జనసేనల దూకుడుకు కళ్లెం వేయాలంటే ముందస్తు ఎన్నికలకే వెళ్లాలని వైసీపీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు వస్తే తాము కూడా సిద్ధమేనని ప్రకటించిన చంద్రబాబు మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టోను సైతం ప్రకటించేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 నెలల వరకు గడువు ఉన్నప్పటికీ..ముందస్తు ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు అలర్ట్ అయి ఒక అడుగు ముందుకు వేశారని తెలుస్తోంది. అందుకే మహానాడు వేదికగా హడావుడిగా మేనిఫెస్టోను ప్రకటించారనే ప్రచారం జరుగుతుంది.

ఈనెల 7న ఏపీ కేబినెట్ భేటీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవలే ఢిల్లీలో మూడు రోజులపాటు పర్యటించారు. నీతి ఆయోగ్ సమావేశంతోపాటు నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అలాగే పలువురు కేంద్రమంత్రులతోనూ చర్చించారు. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సైతం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాత్రి 10 గంటల తర్వాత భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలకుపైగా వీరిద్దరి మధ్య భేటీ జరిగింది. పేరుకే పోల‌వ‌రం, క‌డ‌ప ఉక్కు, తెలంగాణ నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలు వంటి అంశాలపై చర్చించారనే ప్రెస్‌నోట్ విడుదల చేసినప్పటికీ రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నే వ్యూహంతోనే జ‌గ‌న్.. అమిత్‌షాని కలిశారని ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన సీఎం ఈనెల 7న కేబినెట్ భేటీకి సిద్ధం కావాలని పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ కేబినెట్ భేటీలో ముందస్తు ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కీలకమైన హామీలపై కూడా వాడి వేడిగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉంటాయా? ఏపి కేబినెట్‌లో సీఎం వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.

Read more:

సోది ఆపి కొవ్వు కరిగించే పనిలో ఉండు.. కేశినేనికి పీవీపీ కౌంటర్

Advertisement

Next Story

Most Viewed