- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిద్దుబాటు దిశగా..ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించేందుకు వైసీపీ కసరత్తు
దిశ, ఏపీ బ్యూరో : స్థానిక సంస్థల ప్రతినిధులు చేసిన పనులకు కొన్నేళ్ల నుంచి బిల్లుల చెల్లింపు జరగడం లేదు. సీఎఫ్ఎంఎస్లో బిల్లులు మూలుగుతున్నాయి. ఇటీవల సుమారు రూ.600 కోట్లదాకా చెల్లించేశారు. ఇంకా మిగిలిపోయిన బిల్లులను కూడా చెల్లిస్తామని అధికారులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ భరోసా ఇస్తున్నారు. తొమ్మిదేళ్ల నాటి రెవెన్యూ లోటుకు సంబంధించి ప్రభుత్వానికి రావాల్సిన దాంట్లో కేంద్రం ఈ మధ్యనే రూ.10,464 కోట్లు విడుదల చేసింది. నిరంతరం అప్పుల కోసం తిప్పలు పడే ప్రభుత్వానికి కొంత ఊరట లభించింది. సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లించడానికి ఇది దోహదపడింది. గత ఎన్నికల్లో పార్టీకి అన్నీ తామై నిలిచిన కార్యకర్తలు, నాయకులను తిరిగి దగ్గరకు చేర్చుకునే పనిలో వైపీపీ అధిష్టానం నిమగ్నమైంది.
ప్రభుత్వ ఉద్యోగులు శాంతించినట్లేనా?
ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. పదకొండో పీఆర్సీ బకాయిలు చెల్లించకపోవడం, సీపీఎస్ రద్దు చేయలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లను బుజ్జగించేందుకు ఉద్యోగ సంఘాల జాయింట్ కౌన్సిల్ పేరుతో మంత్రులు సమావేశమయ్యారు. పీఆర్సీ డీఏ బకాయిలను 16 విడతల్లో నాలుగేళ్లలో చెల్లిస్తామని రాతపూర్వకంగా అంగీకరించింది. వచ్చే ఏడాది నుంచి జనవరి నుంచి చెల్లింపులు మొదలవుతాయని పేర్కొంది. సీపీఎస్ రద్దు చేయలేకపోయినా జీపీఎస్‌కు సంబంధించి కొన్ని ప్రోత్సాహకాలకు అంగీకారం తెలిపింది. 2014కు ముందు ఐదేళ్ల సర్వీసు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామనే భరోసా ఇచ్చింది. వీటితో ప్రభుత్వ ఉద్యోగుల్లోని అసంతృప్తి తొలగిపోతుందని అధికార పార్టీ భావిస్తోంది. చాలా మంది ఉద్యోగులు ఆయా సంఘాల నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు అమ్ముడు పోయారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు కదిలేనా..
తాజాగా పోలవరం ప్రాజెక్టు అంచనాలతో సంబంధం లేకుండా రూ.12,911 కోట్లు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. వాస్తవానికి ఈ సొమ్ము సరిపోదు. 2018లో కేంద్ర జలశక్తి శాఖ ఆమోదించిన సవరించిన అంచనాల ప్రకారం రూ.55,565 కోట్లు ఇస్తే తప్ప ప్రాజెక్టు నిర్మాణం, ముంపు వాసుల పరిహారం, పునరావాసం పూర్తి కాదు. ఇప్పటిదాకా ప్రాజెక్టు నిర్మాణంపైనే దృష్టి సారించారు. నిర్వాసితుల పరిహారం, పునరావాసానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లింపు, పునరావాసానికి సంబంధించి కనీసంగా రూ.30 వేల కోట్లు అవసరం. నిధుల కొరత వల్లే ప్రభుత్వం 41.6 అడుగుల నీటి నిల్వ మేరకు ముందుగా పరిహారం, పునరావాసం కల్పించాలని నిర్ణయించింది. ఇలా దశల వారీ ప్రాజెక్టు ముంపు వాసులకు చెల్లిస్తామని చెబుతోంది. దీన్ని ముంపు వాసులు ఆమోదిస్తారా.. ప్రభుత్వంపై సానుకూలత వ్యక్తం చేస్తారా అనేది ప్రశ్నార్థకమే.
వైసీపీ సొంత సర్వేల్లో తేలింది ఇదే..
రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం ఎన్ని తిప్పలు పడుతున్నా ఇటీవల ఆర్థిక స్థితి కొంత మెరుగుపడినట్లు కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వర్గాలపై దృష్టి సారించింది. అధికార వైసీపీ ఇటీవల చేయించుకున్న సొంత సర్వేల్లో సైతం మళ్లీ అధికారానికి వచ్చేందుకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లు వెల్లడైంది.
జగన్ పై కేంద్ర పెద్దల వైఖరిలో మార్పు..
కేంద్రంలోని బీజేపీ మరింత బలహీన పడిందనే రాజకీయ వాతావరణంతో సీఎం జగన్ పట్ల కేంద్ర పెద్దల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఇదే ఊపులో జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ మాజీ ఎంపీ ఉండవల్లి వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి కేంద్ర సర్కారు అవసరాల కోసం హోదా ఇవ్వడానికి వెనుకాడకపోవచ్చు. ఇవతల టీడీపీకి కన్ను కొడుతున్నా మరోవైపు సీఎం జగన్‌ను వదులుకోవడానికి బీజేపీ పెద్దలు సిద్దంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఎన్నికల నాటికి ఏదో విధంగా ప్రభుత్వంపై నెగటివిటీ తగ్గించుకునే దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా సీఎం జగన్ వివిధ పథకాల పేరుతో నిరంతరం జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ వర్గాల్లో నాలుగేళ్లుగా మూటగట్టుకున్న వ్యతిరేకత ఒక్క ఏడాదిలో తొలగిపోతుందా? వేచి చూడాల్సిందే.
- Tags
- YCP
- government