మెగాస్టార్ చిరంజీవిపై టీడీపీ అస్త్రం: చంద్రబాబు వ్యూహం ఫలించేనా?

by Seetharam |
మెగాస్టార్ చిరంజీవిపై టీడీపీ అస్త్రం: చంద్రబాబు వ్యూహం ఫలించేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో : మెగాస్టార్ చిరంజీవి చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. ఏపీ ప్రభుతవ్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మెగాస్టార్ చెప్తే వినే స్థితిలో తాము లేమని మంత్రులు చెప్తున్నారు. మరికొందరైతే చిరంజీవి ఇచ్చేటువంటి పకోడి ఐడియాలు తమకు అవసరం లేదని అంటున్నారు.చిరంజీవి ఇచ్చే సలహాలు అన్నీ వైసీపీ ప్రభుత్వానికి కాదు తమ్ముడు పవన్ కల్యాణ్‌కు చెప్పుకోవాలంటూ హితవు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవిపై మంత్రులు, వైసీపీ నేతలు ఇస్తున్న కౌంటర్లపై మెగా అభిమానులు, జనసేన నేతలు ఖండిస్తున్నారు. అంతేకాదు చిరంజీవిని తమ వాడంటే తమవాడన్నట్లుగా అటు జనసేన ఇటు టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవిపై మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నాని మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, బొత్స సత్యనారాయణ, ఆర్‌కే రోజాల విమర్శలకు టీడీపీ నేతలు పోటీ పడి మరీ కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవిని తమ వాడిగా ముద్ర వేయించుకునేందుకు..వైసీపీకి దూరం చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. మెుత్తానికి ఏపీ రాజకీయం మెగాస్టార్ చుట్టూ తిరుగుతుండటం...ఎప్పుడు ఎలాంటి మలుపులకు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

మెగాస్టార్ చుట్టూనే రాజకీయం

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్లు సినీ ఇండస్ట్రీపై రాజకీయ నాయకుల దాడి ఏంటి అని మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అంతేకాదు ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని అంతేగానీ సినీ హీరోల రెమ్యునరేషన్‌లపై రాజ్యసభలో ప్రస్తావించడం ఏంటని చిరంజీవి నిలదీశారు. సినీ పరిశ్రమ ద్వారా ఎంతో మందికి ఉపాధి కలుగుతోందని చెప్పుకొచ్చారు. తాను సినిమా..రాజకీయాలు రెండు చూసానని గుర్తు చేసారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం కొనసాగుతుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యల్లో తప్పేముందని పలువురు నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిపై వస్తున్న విమర్శలను మెగా అభిమానులు, జనసేన పార్టీ నేతలు ఖండించడంలో అతిశయోక్తి ఏమీ లేదు. కానీ టీడీపీ నేతలు పోటీపడి మరీ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

మాపై సినిమాలు తీసినప్పుడు విలువలు గుర్తుకు రాలేదా?

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేతల విమర్శలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. ప్రభుత్వానికి హితవు పలికితే వాటిని స్వాగతించాలి కానీ ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగత విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై ఎవరూ విమర్శలు చేయకూడాదా..? ఇదేమైనా నియంత పాలనా అని చంద్రబాబు నాయుడు నిలదీశారు. మరోవైపు నారా లోకేశ్ సైతం స్పందించారు. చిరంజీవి నిజాలు మాట్లాడితే వైసీపీ వాళ్లు రోడ్లపైకి వచ్చి వీరంగం ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు. సినిమా పరిశ్రమపై రాజకీయాలు చేయొద్దనటం కూడా నేరమే అని ప్రశ్నించారు.

జరిగిందే సినిమాలో చూపించినందుకు విమర్శలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తనను, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ కట్టుకథలతో సినిమాలు తీసినప్పుడు ఈ వైసీపీ వాళ్లకు విలువలు గుర్తుకు రాలేదా అని లోకేశ్ నిలదీశారు.

టీడీపీ నేతల మద్దతు

ఇదిలా ఉంటే మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు సైతం చిరంజీవి వ్యాఖ్యలకు మద్దతు పలికారు. సాధారణంగా విమర్శలకు, వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవి వంటి వారికి కూడా ఇబ్బంది కలిగి అలా మాట్లాడారంటే రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చునని గంటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ఆయన వాస్తవాలే మాట్లాడారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చారు అంతే కదా అని చెప్పుకొచ్చారు. చిరంజీవి చెప్పిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వైపు దృష్టి సారించకుండా పట్టుమని పది నిముషాలు తమ శాఖలు గురించి మాట్లాడలేని మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చి అదేదో బ్రహ్మాండం బద్దలైనట్టు ఏదేదో ఆయన గురుంచి మాట్లాడటం సరికాదు అని గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు సైతం చిరంజీవికి మద్దతుగా నిలిచారు. ఇలా మెగాస్టార్ చిరంజీవికి మద్దతుగా టీడీపీ సభ్యులు అండగా నిలవడంతో రాజకీయ వర్గాల్లో మరో సరికొత్త చర్చకు తెరలేపినట్లైంది.

Read More..

పవన్ కల్యాణ్‌కే నా మద్దతు.. వైసీపీకి రేణు దేశాయ్ స్ట్రాంగ్ కౌంటర్ (వీడియో)

సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు.. మెగాస్టార్‌కు YCP ఎంపీ కౌంటర్

Next Story

Most Viewed