తిరుపతిలో ఉద్రిక్తత.. టీడీపీ లీడర్ల అరెస్ట్

by srinivas |
తిరుపతిలో ఉద్రిక్తత.. టీడీపీ లీడర్ల అరెస్ట్
X

దిశ, తిరుపతి: ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు తిరుపతిలో ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఎన్నికల సంఘం, పోలీసులు ఎంత పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ దొంగ ఓట్లు, ప్రలోభాలు ఆపలేకపోయారు. దీనిపై ప్రతిపక్షం ఆందోళనకు దిగడం, నిలదీయడంతో వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

తిరుపతి ఎస్జీఎస్ హైస్కూల్ పోలింగ్ బుత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నాయకులు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ పోలింగ్ బూత్ వద్దకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నాయకులు రావడంతో అక్కడ టెన్షన్ వాతావరణం కనిపించింది. వారిని వైసీపీ లీడర్లు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నడిచింది. పోలీసులు రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది.

వైసీపీ లీడర్ల అభ్యంతరంతో టీడీపీ నాయకులను పోలీసులు పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపించేశారు. దీనిపై మండిపడ్డ టీడీపీ నాయకులు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దొంగ ఓట్లను కట్టడి చేయాలంటూ పోలీసులను మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నిలదీశారు. అక్రమాలు చేసి గెలవాలని ప్రభుత్వం భావిస్తోందని... అందుకు పోలీసుల సాయం తీసుకుంటుందని మండిపడ్డారు.

తిరుపతి లోని 223వ పోలింగ్ బూత్లో టీడీపీ ఏజెంట్‌గా ఉన్న టీడీపీ నేత పులిగోరు మురళిని పోలీసులు అరెస్టు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారిని మురళి ప్రశ్నించడంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దొంగ ఓట్లు వేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, అందుకే వారిని నిలదీశారు చెబుతున్నారు. మురళిని అరెస్ట్ చేసి పోలీసులు రేణిగుంట స్టేషన్‌కి తరలించారు.

అలాగే సత్యనారాయణ పురం పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నాయకుడు కండ్ర లక్ష్మీపతిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగ ఓట్లు వేస్తున్నారని వారిని ప్రశ్నించినందుకే లక్ష్మీపతిని అరెస్టు చేశారని మండిపడుతున్నారు టీడీపీ లీడర్లు. వైసీపీ నాయకులు పోలింగ్ కేంద్రం వద్దే ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంజయ్ గాంధీ కాలనీ వద్ద దొంగ ఓట్లు వేసేందుకు మహిళలు వచ్చారు. ఏం చదువుకున్నారు... విద్యార్హతలు ఏంటని ప్రశ్నించడంతో 6,9 వ తరగతి చదువుకున్నామని మీడియాకు చెప్పారు. దొంగ ఓట్లు వేస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ చెప్పిన విషయాన్ని మీడియా ప్రతినిధులు గుర్తు చేయడంతో అక్కడి నుంచి వాళ్లు జారుకున్నారు. ఓటు వేయకుండానే మహిళలంతా వెళ్లిపోయారు. సంజయ్ గాంధీ కాలనీ 228 పోలింగ్ బూత్ వద్ద కొంతమంది అనర్హులతో ఓట్లు వేయించేందుకు వైసీపీ ప్రయత్నించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారిని అడ్డుకోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని టీడీపీ లీడర్లను అక్కడి నుంచి తీసుకెళ్లడంతో అంతా సర్దుకుంది.

Advertisement

Next Story

Most Viewed