- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
LankaLands: అంతా అధికార పార్టీ నేత కనుసన్నల్లోనే..!
దిశ, కొత్తపేట: అవి శ్రేష్టమైన లంక భూములు. ఏటా వచ్చే గోదావరి వరదల ఒండ్రు మట్టితో సిరులు పండే ఆ భూములు చెరువులుగా మారుతున్నాయి. అంటే చేపలో, రొయ్యలో పెంచుకునే చెరువులు కాదు. మట్టి మాఫియా అక్రమార్జన కోసం ఆ భూములు మాయమైపోతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం, చొప్పెల్ల లంక భూముల దయనీయ పరిస్థితి ఇది. గోదావరి నదీ కోతకు తమ భూములు కోత గురవుతున్నాయని ఓవైపు రైతులు గగ్గోలు పెడుతుంటే మరో వైపు భూ బకాసురుల అక్రమాలకు ఈ భూములు కనుమరుగవుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూములే. ఆర్థికంగా వెనకబడిన పట్టాదారులకు డబ్బులు ఆశ చూపి అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. గతంలో రాత్రివేళలో చాటుమాటుగా ఈ తవ్వకాలు జరిగేవి. కానీ ఇప్పుడు రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా పెద్దపెద్ద మిషన్లతో ఈ లంక భూములను దొలిచేస్తున్నారు.
దీనంతటికి కారణం అధికార పార్టీ కొత్తపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలనే ఆరోపణ వెల్లువెత్తుతున్నాయి. మట్టి మాఫియాకు "రాజు"గా పేరొందిన ఒక వ్యక్తికి ఈ భూములలో మట్టిని తవ్వుకుని ఇటుక బట్టీలకు అమ్ముకునే విధంగా కోట్లాది రూపాయలకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. అక్రమంగా మట్టి తవ్వకాలలో ఆరితేరిన ఆ వ్యక్తిని ఈ లంక భూముల వైపుకు రానీయకుండా చాలా ఏళ్లుగా స్థానికులు అడ్డుకట్ట వేశారు. కాని ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో పలుకుబడి పెరగడంతో ఇక్కడకు వచ్చి మట్టితవ్వకాలకు జెండా పాతాడు.
పువ్వులు, కూరగాయల తోటలతో కళకళలాడుతూ ఉండే ఈ భూములు చెరువులుగా మారుతుంటే పక్క రైతుల ఆవేదనకు అంతులేకుండా పోతుంది. వాళ్ళు కూడా విధి లేక ఈ మట్టి తవ్వకాలకు భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ తవ్వకాలు అడ్డుకోవాలని రైతులు, గ్రామస్తులు గగ్గులు పెడుతున్నా వారి ఆవేదనను వినే నాధుడే కరువయ్యాడు. కొంతమంది స్వార్థపరులు అక్రమ తవ్వకాలు చేపడుతుండటంతో ప్రతిపక్ష పార్టీ నాయకులేగాక అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులైతే అటువైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయడంలేదు. ఎందుకంటే ఆ తవ్వకాలు పూర్తిగా అధికార పార్టీ అండదండలతో జరుగుతున్న తంతు. కాదూకూడదని ఆ తవ్వకాల ప్రాంతానికి వెళ్తే ఆ అధికారికి బదిలీ ఉత్తర్వులు సిద్ధంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.