అక్రమాస్తులు, దోపిడీపై సమాచారం ఇచ్చే వారికి గిఫ్ట్ ఇస్తాం: Pawan Kalyan

by Seetharam |   ( Updated:2023-08-15 12:57:32.0  )
Pawan Kalyan: మైండ్ గేమ్ పాలిటిక్స్‌పై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అక్రమాస్తులు, దోపిడీపై సమాచారం ఇచ్చే వారికి గిఫ్ట్ ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమం తీసుకువస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తమ పాలనలో అవినీతి, అక్రమాలకు తావిచ్చే ప్రసక్తే లేదని వెల్లడించారు. జనసేన కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతరం వీరమహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీకి ఓటెయ్యకపోతే పథకాలు రావనే భయం వద్దని పవన్ కల్యాణ్ ప్రజలకు సూచించారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాల కంటే పారదర్శకంగా మరిన్ని మంచి పథకాలు ఇస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి అండగా నిలవాలని సూచించారు. మీ బిడ్డల భవిష్యత్తు కోసం బలంగా పనిచేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అంతేకాదు విశాఖ ఉక్కును కాపాడుకుంటామని, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ అవ్వకుండా అడ్డుకుంటామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. గోదావరి జిల్లాలలో ప్రస్తుతం తాడగానికి నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని.. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్‌ పాలన అస్తవ్యస్తంగా ఉందని జనసేనాని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

స్త్రీలు తలచుకుంటే ఏదైనా సాధ్యమే

జనసేన పార్టీ అధ్వర్యంలో ప్రజా కోర్టు అనే పేరుతో సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ చేయనున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ వెల్లడించారు. 38 కేసులు ఉన్న వైఎస్ జగన్ కోర్టు తీర్పులను తప్పు పట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల తీర్పుల పట్ల జగన్ వ్యవహరించే తీరు రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అ సమజాన్ని మార్చగలిగే శక్తి స్త్రీలకు మాత్రమే ఉందని.. స్త్రీ తలచుకుంటే మార్పు తథ్యమని అన్నారు. మహిళలు బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా మార్పు తీసుకొస్తామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాణంలో 15 మంది మహిళలు కూడా పాలుపంచుకున్నారని గుర్తు చేశారు. అంతేకాదు మహిళ వంటగదికి పరిమితం కాకుండా తన స్వంత కాళ్ళ మీద నిలబడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చట్టసభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు ఉండాలి అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.వైఎస్ జగన్ ఇంకోసారి అధికారంలోకి వస్తే తాము ఏపీలో ఉండలేమని...వేరే రాష్ట్రాలకు లేదా దేశాలకు తరలిపోతున్నామని కొంతమంది అంటున్నారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఎక్కడకు వెళ్లినా వివక్ష ఉంటుందని, మీరెందుకు మీ నేల విడిచి వెళ్లిపోవాలి? ఎదురు తిరగాలి కదా..? అని పవన్ కల్యాణ్ సూచించారు.

మహిళల మిస్సింగ్ చాలా పెద్ద విషయం

రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములుకు వైసీపీ పాలనలో సరైన గౌరవం దక్కలేదు అని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వాలు పొట్టి శ్రీరాములును విస్మరించాయి అని చెప్పుకొచ్చారు. ఒక వర్గానికి మాత్రమే ఆయనను పరిమితం చేశాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కేవలం సీఎం ఫొటోలు కనిపిస్తే సరిపోతుందా? మనకోసం బలిదానం చేసిన వారిని గౌరవించుకోవాలి కదా అని పవన్ అన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే బలిదానాలు చేసిన మహానీయులను గౌరవించుకుంటాం అని పవన్ కల్యాణ్ తెలిపారు. మరోవైపు వైసీపీ పాలనలో మహిళలు అదృశ్యం కావడం చాలా పెద్ద విషయమని దాన్ని అసలు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం వైఎస్ జగన్ నివసించే తాడేపల్లి ప్రాంతంలో అత్యధిక క్రైమ్‌ రేట్‌ ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో గ్యాంగ్‌రేప్‌, హత్యలు జరుగుతున్నాయని ఇంతలా జరుగుతున్నా మహిళా కమిషన్‌ ఏమీ మాట్లాడటం లేదని పవన్ కల్యాణ్ ఆక్షేపించారు. మహిళల భద్రతకు జనసేన పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed