- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chandrababu: ఆ భూమి జగన్ తాతిచ్చాడా?
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రూరుడు, సైకో అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సీఎం జగన్ బొమ్మను రోజూ చూడాలా? అని ఆయన ప్రశ్నించారు. 'పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ ఫొటో పెట్టడమేంటి.? ఆ భూమి జగన్ తాతిచ్చాడా? మీ తాత..ముత్తాతలిచ్చారు తప్ప మీ భూములు జగన్ జాగీరు కాదు కదా?'. అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ఓ సైకో అని.. సైకో పాలన వద్దని.. సైకిల్ పాలన రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బొబ్బిలిలో ఇదేం ఖర్మ మన రైతులకు సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రైతులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. 'వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఎన్టీఆర్, నేను వ్యవసాయం చేసి రాజకీయాల్లోకి వస్తే..జగన్‌కు అసలు వ్యవసాయమే తెలీదు. అందుకే రైతుల ఇబ్బందులు, సమస్యలు తెలిసిన పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ జెండాలో నాగలి గుర్తును పెట్టాం. నిత్యం రైతుల గురించి ఆలోచించే ఏకైక పార్టీ తెలుగుదేశం. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడమేంటి? యూనిట్ విద్యుత్ ధర ఇంత అధికంగా ఉండడం ఏమిటి?.' అని చంద్రబాబు నాయుడు నిలదీశారు.
ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ కోసం రూ.1550 కోట్లు ఖర్చు చేశా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విధానాలు ఎవరికీ ఉపయోగకరంగా లేవని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్బీకేలు పెట్టమని ఎవరూ కోరలేదని, వలంటీరు వ్యవస్థను పెట్టి రైతులపై పెత్తనం చలాయించేలా చేశారని. ఈ అధికారం ఎవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. 'ప్రస్తుత ఆర్బీకేల్లో అన్నీ సమస్యలే. టీడీపీ పర్చెసింగ్ సెంటర్‌లు ఏర్పాటు చేసింది. రైస్ మిల్లర్లు ఎంతకు కొనాలి అనేదానిపై ప్రయోగాలు చేసి చివరకు నేను ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా సంఘాలను పంపి రైతుల కళ్ళం దగ్గరే పారదర్శకంగా డబ్బులిచ్చేలా చేశాం.' అని చంద్రబాబు చెప్పారు. 'అలాంటి వ్యవస్థల్ని ఈ ముఖ్యమంత్రి నాశనం చేశారు. భారతదేశానికే తిండి పెట్టిన రాష్ట్రం అంధ్రప్రదేశ్. అందుకే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయింది. బ్రిటీష్ వారు పోతూ పోతూ కాటన్ ధవళేళ్వరం బ్యారేజ్ కట్టారు. కృష్ణా నదిపై ఆనకట్టకట్టడంతో ఆ జిల్లాల్లో అభివృద్ధి జరిగింది. విజయనగరం జిల్లాలో పది అడుగుల్లోనే నీళ్లు ఉంటాయి. కానీ విజయనగరం జిల్లాలో పంపు సెట్లు పెట్టలేదు.' అని చంద్రబాబు తెలిపారు. వేదవతి, జంఝావతి, వెంగళరావు సాగర్, మద్దివలస, వంశధార, నాగావళి అనుసంధానం చేయడం వంటి వాటికి రూపకల్పన చేశామని, తోటపల్లి ప్రాజెక్టు తానే పని ప్రారంభించి పూర్తి చేశానన్నారు. వెంగళరావు ప్రాజెక్టుకు ఎప్పుడో వేసిన ఫౌండేషన్‌ను తాను పూర్తి చేశానని గుర్తు చేశారు. రూ.1,550 కోట్లను ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు
రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీరివ్వాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా శాశ్వతంగా మంచిచేసే విధంగా చేయాలని ముందుకు పోతే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ చేసిన పనులకు బాధ, కోపం, ఆవేశం వస్తోందని, కానీ నిబ్బరం చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. మలేషియాలో ఉండే పామాయిల్‌ను దేశానికి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. '2014-19 తెలుగుదేశం పార్టీ హయాంలో రైతులకు స్వర్ణయుగం. వ్యవసాయంలో 11శాతం వృద్ధి సాధించాం. నేడు రైతు సంక్షేమం ఎక్కడా లేదు. అంతా సంక్షోభమే. పామాయిల్, శనగలకు ధర లేకపోత ఎంఎస్పీ ఇచ్చాం. పామాయిల్ ధర రూ.22 వేల నుంచి రూ.11 వేలకు పడిపోవడం బాధాకరం. ఎన్నికలకు ముందు జగన్ షుగర్ ఫ్యాక్టరీపై పెద్ద పెద్ద మాటలు చెప్పి షుగర్ ఫ్యాక్టరీని ముంచేసే పరిస్థితికి వచ్చింది.' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
రైతులు వేధింపులకు గురవుతున్నారు
జగన్ వచ్చాక 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. 'దేశంలో రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉంది. దేశంలో రైతుల అప్పుల్లో నెంబర్ వన్‌లో ఉన్నాం. సగటున రూ.2 లక్షల 45 వేలు ప్రతి ఒక రైతుపైన అప్పు ఉంది. ఇది జగన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన విజయం' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జగన్ రెడ్డి వచ్చి మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నాడని, శ్రీకాకుళంలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదనీ..విజయవంతమైందని గొప్పలు చెప్పుకుంటున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. 'రాష్ట్రంలో రైతులకు మిగిలింది అప్పులు తప్ప ఏమీ లేదు. రైతులు వేధింపులకు గురవుతున్నారు. టీడీపీ హయాంలో గోనె సంచులు ఇవ్వలేదంటే రోడ్లపైకి వచ్చి.. సాధించుకునే వారు. కానీ ఇప్పుడు రైతులందరికీ కేసుల భయం పట్టుకుంది. రైతులను వేధించి భయపెడుతున్నారు. రైతులు చైతన్యవంతులు కావాలి.' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
రైతుల డిమాండ్లన్నింటిని నెరవేరుస్తా
అమరావతి రాజధాని అంశంపై చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం 33 వేల ఎకరాలను 29వేల మంది రైతులు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. 'ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా మేం ఇస్తాం రాజధాని కట్టండి అని ముందుకు వచ్చారు. ఈ రాజధాని వల్ల మేము కూడా బాగుపడతాం రాష్ట్రం బాగుపడుతుందని భూములు ఇచ్చారు. ఈ ఉన్మాది ముఖ్యమంత్రి వారందరినీ సర్వనాశనం చేశారు. ఆడవారిని హింసించి దారుణంగా వ్యవహరించారు. ఇక ఏ రైతు కూడా భూమి ఇవ్వాలంటే ముందుకు రాడు. రాష్ట్రంలో రైతులు కోరిన వాటన్నింటినీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా వేరవేరుస్తా.' అని చంద్రబాబు హామీ ఇచ్చారు.