Visakha Breaking: రోడ్డెక్కిన కిడ్నీ బాధితుడు.. కలెక్టర్ రావాల్సిందేనని ఆందోళన

by srinivas |   ( Updated:2023-04-27 13:49:57.0  )
Visakha Breaking: రోడ్డెక్కిన కిడ్నీ బాధితుడు.. కలెక్టర్ రావాల్సిందేనని ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ కిడ్నీ బాధితుడు వినయ్ కుమార్ బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. మధురవాడ వాంబే కాలనీలో బాధితుడు వినయ్ కుమార్‌తో కలిసి రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ సమయంలో వినయ్ కుమార్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. దీంతో స్థానికులు అడ్డుకున్నారు. ఎలాంటి న్యాయమైనా ఇక్కడే జరగాలంటూ స్థానికులు పట్టుబట్టారు.

విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు

కాగా విశాఖలో మరో కిడ్నీ రాకెట్ బయటపడింది. కిడ్నీ అమ్మకం వ్యవహారంలో మీడియేటర్ కీలకంగా వ్యవహరించగా, ఎముకుల డాక్టర్ కిడ్నీని తొలగించడం వెనుక మూలాల్ని పోలీసులు శోధించే పనిలో పడ్డారు. కామరాజు అనే వ్యక్తి ఒక పేషెంట్‌కు కిడ్నీ అత్యవసరమని చెప్తూ డబ్బులు ఆశ చూపెట్టేవారు. వాంబే కాలనీకి చెందిన వినయ్ కుమార్ ఒక దశలో పరిచయం అయ్యారు. కిడ్నీ కొనుగోలు చేసే వ్యవహారాన్ని చెప్పడంతో అప్పటికే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండడంతో తన కిడ్నీ అమ్మేందుకు ఒప్పించారు. రూ.8.5లక్షలకు ఒప్పందం కుదరగా, అడ్వాన్స్‌గా రూ.2.5 లక్షలు అందచేశారు. ఆపరేషన్ పూర్తి అయ్యింది.. తన శరీరం నుంచి కిడ్నీ వేరు చేశారు. అయితే ఒప్పందం ప్రకారం మిగిలిన నగదు ఇవ్వలేదు.

ఇదిలా ఉండగా అడ్వాన్సు తీసుకున్నప్పటికి ఆపరేషన్‌కు ఇంకా సిద్ధపడలేదని, సమయం కావాలని అడిగారు. అయితే వినయ్‌తో కామరాజు మాట్లాడాలని చెప్పి పిలిపించి కిడ్నాప్ చేసి కిడ్నీని వేరు చేశారు. తన పని పూర్తి కాగానే వినయ్‌ను ఇంటివద్దకు చేర్చి చేతులు దులుపుకున్నారు. తనకు చెల్లించాల్సిన మిగతా నగదు విషయమై ఎటువంటి సమాధానం రాకపోయేసరికి వినయ్ పీఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు కామరాజు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

డాక్టర్ పరమేశ్వరరావుదే కీలకపాత్ర

విశాఖలోని తిరుమల ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ పరమేశ్వరరావు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలుసుకున్నారు. డాక్టర్ పరమేశ్వరరావు ఎముకల వైద్యులు కాగా.. గతంలో నిమ్స్‌లో విధులు నిర్వర్తించారు. ఎస్‌కోటకు చెందిన ఆయన తిరుమల హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. వాస్తవానికి కిడ్నీ మార్పిడికి నిబంధనలు ఉన్నాయి. ఆర్‌డీవో, తహశీల్దార్, స్థానిక పోలీసులకు కిడ్నీ దాత సమాచారాన్ని తెలియ చేసి అనుమతి పొందాల్సి ఉంది. దాత సమ్మతం, తన కిడ్నీ బంధువులకు ఇస్తున్నానని రాతపూర్వక పత్రం సమర్పించాలి. బయట వ్యక్తులకు కిడ్నీ దానం చేయాలంటే చాలా నిబంధనలున్నాయి. ప్రస్తుతం విశాఖలో ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి పెడితే కీలకమైన విషయాలు బయటపడే అవకాశముంది.

Advertisement

Next Story

Most Viewed