Priyanka Dandi: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సంచలన వ్యాఖ్యలు

by srinivas |
Priyanka Dandi: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఉత్తరాంధ్ర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశాబ్దాలుగా పదే పదే అన్యాయం జరుగుతూనే ఉందని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ ప్రియాంక దండి ఆరోపించారు. విభజన గాయం నుంచి తేరుకోక ముందే రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ కర్మాగారంగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.

స్టీల్ ప్లాంట్ కోసం రిలే దీక్షకు మద్దతు

విశాఖ స్టీల్ ప్లాంట్ గేటు, కూర్మనపాలెం వద్ద కర్మాగారం బీసీ సంఘం కార్మికులు జనరల్ సెక్రటరీ అప్పారావు ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. ఉక్కు పరిశ్రమను కార్మికులు ఉక్కు సంకల్పంతో స్టీల్ ప్లాంట్ బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, వారికి అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రియాంక దండి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉక్కు జన గర్జనలో గర్జించినా పట్టించుకోని మంత్రి

ఫిబ్రవరి 4 న పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఉక్కు జన గర్జన' సభలో మంత్రిగుడివాడ అమర్నాథ్ ప్రభుత్వం తరుపున పోరాటానికి మద్దతు ఇస్తున్నామని చెప్పినా ఆ దిశగా అడుగులు లేవన్నారు. ఆ వేదిక మీద ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం వేసి ప్రధాన మంత్రికి తీసుకువెళ్ళమని కోరారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు స్పందించకపోగా, పార్లమెంట్ సమావేశాలలో కూడా పోరాడింది లేదన్నారు. ఫిబ్రవరి 28లోగా అఖిలపక్షం వేయించాలని డెడ్ లైన్ విధించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కార్యనిర్వాహక కార్యదర్శి జగన్ మురారి, కార్యదర్శి నొల్లు నాగరాజు,ఉక్కు పోరాట సంఘం చైర్మన్ ఆదినారాయణ, కన్వీనర్ గంధం వెంకట్రావు,స్టీల్ ప్లాంట్ బీసీ సంఘం జనరల్ సెక్రటరీ అప్పారావు, కార్మికులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed