నిబంధనలకు పాతర.. దేవాదాయశాఖలో లీజుల అక్రమాలు

by Y.Nagarani |
నిబంధనలకు పాతర.. దేవాదాయశాఖలో లీజుల అక్రమాలు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలకు ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో అక్రమంగా ఇచ్చిన లీజులపై రాష్ర్ట దేవాదాయ శాఖ దృష్టి సారించింది. దేవాదాయ శాఖకు చెందిన విలువైన షాపింగ్ కాంప్లెక్స్ లు, నగరాల్లోని స్థలాలు, వాణిజ్య సముదాయాలను నిబంధనల మేరకు బహిరంగ టెండర్ పిలిచి అప్పగించాల్సివుండగా అందుకు విరుద్ధంగా వైసీపీ నేతల సిఫార్సులతో అధికారులు కట్టబెట్టారు. మూడు సంవత్సరాల కాల వ్యవధికి వీటిని లీజుకు ఇవ్వాల్సివుండగా అందుకు విరుద్ధంగా ఏకంగా 11 సంవత్సరాలకు ఇచ్చేశారు.

అన్నీ తెలిసే అక్రమాలు..

వైసీపీ పాలనా కాలంలో దేవాదాయ శాఖ కమిషనర్లు, అదనపు కమిషనర్లు లంచాలు తీసుకొని సిఫార్సులకు తలొగ్గారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహిరంగ టెండర్ పిలవకుండా మూడేళ్లు మాత్రమే ఇవ్వాల్సిన లీజులను పదకొండేళ్లకు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వీటిపై పరిశీలన జరిపి అవసరమైతే విజిలెన్స్ విచారణకు అప్పగించాలని రాష్ర్ట దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నారని తెలిసింది.

విశాఖ ప్రేమ సమాజం నుంచీ..

విశాఖ రుషికొండలో అత్యంత విలువైన 3.66 ఎకరాల ప్రేమ సమాజం స్థలాన్ని 15 సంవత్సరాల కాలానికి వైసీపీ ప్రభుత్వంలో లీజుకు ఇచ్చేశారు. 2036 వరకూ లీజుకు అప్పగించేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయానికి చెందిన ఎనిమిది షాపులను 11 సంవత్సరాలకు పాత వారికే తిరిగి ఇచ్చేశారు. అప్పటి వైసీపీ శాసనసభ్యుడు సిఫార్సు మేరకు 15 శాతం లీజు మొత్తం పెంపుదల నుంచి కూడా లీజుదారులకు ఉదారంగా మినహాయింపు నిచ్చారు. పాయకరావుపేట పద్మనాభ స్వామి ఆలయానికి చెందిన 14 షాపులను 11 సంవత్సరాలకు కట్టబెట్టేశారు. ఇలా ఇచ్చేసిన వాటిల్లో అనకాపల్లి జిల్లా లంకెలపాలెంలో పరదేశమ్మ అమ్మవారి ఆలయానికి చెందిన అత్యంత విలువైన ఎకరా భూమిని కేవలం రూ.20 వేలలకు 11 సంవత్సరాలకు ఇచ్చేయడంపై విమర్శలు వచ్చాయి. ఆ లీజుదారుడు సబ్ లీజు‌కు ఇచ్చి లక్షలు సంపాదిస్తున్నారనే ఫిర్యాదులు వెళ్లాయి.

శారదా పీఠానికి...

కృష్ణాజిల్లా మచిలీపట్నం రాబర్టసన్ పేటలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి చెందిన 42 షాపులను నిబంధనలకు విరుద్ధంగా పాత లీజు దారులకే ఇచ్చేశారు. విజయవాడ నడిబొడ్డున సామారంగ్ చౌక్ లో రెండు షాపులను ఇలాగే కట్టబెట్టేశారు. గుంటూరు జిల్లా పెదకాకాని, నంద్యాల జిల్లా శ్రీశైలంలో వివాదాస్పద విశాఖ శారదాపీఠానికి ఏకంగా 33 సంవత్సరాలకు లీజు ఒప్పందం చేసేశారు.

విజిలెన్స్ విచారణ...

అప్పటి అధికారులే పలువురు ఇప్పుడూ వుండడం, సరైన చర్యలకు సిద్ధం కాకకపోవడంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వీటిపై కన్నెర్ర జేశారని తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా లీజుల జాబితాను తెప్పించి విజిలెన్స్ విభాగంతో విచారణకు ఆదేశించనున్నారని తెలియవచ్చింది. ప్రతి ఏటా లీజుల ద్వారా కోట్లు రావాల్సి వుండగా నేతల కుమ్మక్కు, అధికారుల అవినీతి అక్రమాలు దానికి గండి కొట్టాయి. వీటన్నింటిపై విచారణ జరుగనుంది.

Next Story

Most Viewed