Visakha: భీమిలి నియోజకవర్గానికి భారీగా పెట్టుబడులు

by srinivas |
Visakha: భీమిలి నియోజకవర్గానికి భారీగా పెట్టుబడులు
X

దిశ, విశాఖపట్నం: విజయదశమి నాటికి పరిపాలన రాజధాని భీమిలి నియోజకవర్గానికి తరలిరానుందని, దీంతో ఈ ప్రాంతంలో ప్రభుత్వం రూ. 100 కోట్లతో పెట్టుబడి పెట్టబోతోందని వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వై.వీ.సుబ్బారెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆనందపురం మండలం గోరింట గ్రామంలో సుమారు 5 ఎకరాలలో 20 కోట్ల రూపాయలు వ్యయంతో ఎక్సైజ్ కాంప్లెక్స్ నిర్మాణానికి వై.వి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కే.నారాయణస్వామి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలో రానున్న మూడు, నాలుగు నెలల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించారని తెలిపారు. ఏపీఐఐసీకి భూములు ఇచ్చిన రైతులకు 28 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించామని ఆయన చెప్పారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి నియోజకవర్గ స్వరూపం పూర్తిగా మారబోతుందని, దీంతోపాటు ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయని తెలిపారు. విశాఖపట్నం పోర్టు నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకు ఆరు లైన్ల రహదారి రానున్నదని అవంతి చెప్పారు.

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి వివిధ పరిశ్రమలతో చేయించిన ఘనత మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు దక్కిందని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో పేదవాడు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. పేదల తలరాతలు మార్చేందుకు, వారి పిల్లలకు నాణ్యతతో కూడిన ఆంగ్ల విద్యను అందిస్తున్నారని చెప్పారు.

చంద్రబాబు నాయుడుపై అన్యాయంగా కేసులు బనాయించారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోందని, అయితే జనం వాటిని నమ్మకుండా వాస్తవాలు తెలుసుకున్నారని అన్నారు.

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ ఎక్సైజ్ కాంప్లెక్స్ ఈ ప్రాంతానికి రావడం వల్ల స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నారు. సీఎం విశాఖకు వస్తున్న నేపథ్యంలో భీమిలి ప్రాంతానికి ప్రాముఖ్యత పెరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు దృష్టి సారిస్తున్నారని చెప్పారు.

Advertisement

Next Story