Visakha to Varanasi: ఏప్రిల్ 19 నుంచి ప్రత్యేక రైళ్లు

by srinivas |   ( Updated:2023-04-12 11:18:27.0  )
Visakha to Varanasi: ఏప్రిల్ 19 నుంచి ప్రత్యేక రైళ్లు
X







దిశ, డైనమిక్ బ్యూరో: పవిత్రమైన గంగా పుష్కరాల్లో పాల్గొనే భక్తులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. గంగా పుష్కరాల పాల్గొనేందుకు వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లను మంజూరు చేసింది. ఈ విషయాన్ని శ్రీకాశీ తెలుగు సమితి గంగా పుష్కరాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. గంగా పుష్కరాల కోసం విశాఖపట్నం నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లు మంజూరు చేయాలని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను విజ్ఞప్తి చేశారు. ఎంపీ విజ్ఞప్తితో ప్రత్యేక రైళ్లు నడిపించేందుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో మోడీకి, అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ జీవీఎల్ ధన్యవాదాలు తెలిపారు.


‘విశాఖపట్నం నుంచి వారణాసికి గంగా పుష్కరాల కోసం ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26వ తేదీల్లో బయలుదేరి ఏప్రిల్ 20, 27వ తేదీల్లో తిరిగి వెళ్తాయి. వేసవి కాలంలో రద్దీ కారణంగా విశాఖపట్నం నుండి వారణాసి, రిటర్న్ ప్రత్యేక రైళ్లు కూడా మేలో 5 రోజులు, జూన్‌లో నాలుగు రోజులు నడుస్తాయి. ఈ విధంగా విశాఖపట్నం నుంచి వారణాసికి 11 జతల ప్రత్యేక రైళ్లు నడపబడి తిరుగు ప్రయాణం కానున్నాయి’ అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. వాల్తేరు డివిజన్ ప్రత్యేక రైళ్ల కోసం కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించినప్పటికీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జోక్యం చేసుకుని విశాఖపట్నం నుండి వారణాసికి తక్షణమే ప్రత్యేక రైళ్లు కావాలని పట్టుబట్టడంతో ఈ ప్రత్యేక రైళ్లను కేంద్రం మంజూరు చేసింది. గంగా పుష్కరాలకు, వేసవి సెలవులకు వెళ్లే యాత్రికుల కోసం సకాలంలో విశాఖపట్నం నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్ల మంజూరుకు తన జోక్యం, కృషి దోహదపడ్డాయని ఎంపీ జీవీఎల్ సంతోషం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని ప్రజలు, వ్యాపారుల సమస్యల పరిష్కారానికి, ఆంధ్రప్రదేశ్‌ సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. ఎక్కువ సంఖ్యలో యాత్రికులు వారణాసికి వెళ్లేందుకు వీలుగా విజయవాడ, తిరుపతి నుంచి వారణాసికి మరిన్ని ప్రత్యేక రైళ్లను మంజూరు చేసేలా కృషి చేస్తానని ఎంపీ జీవీఎల్ ప్రకటించారు.




Advertisement

Next Story