విశాఖ ఫిషింగ్ హార్బర్‌‌ ఘటన కలచివేసింది: నారా లోకేశ్

by Seetharam |
విశాఖ ఫిషింగ్ హార్బర్‌‌ ఘటన కలచివేసింది: నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈ ప్రమాదం తనను ఎంతో కలచివేసిందని అన్నారు. అగ్నిప్రమాదంలో మత్స్యకారులకు చెందిన 40బోట్లు, కోట్లాదిరూపాయల మత్స్యసంపద అగ్నికి ఆహుతికి కావడం బాధ కలిగించిందన్నారు. అత్యంత సున్నితమైన షిప్ యార్డు ప్రాంతంలో భద్రతాచర్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణం అని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంలో నష్టపోయిన వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని పేద మత్స్యకారులైనందున ప్రభుత్వం పెద్దమనసుతో స్పందించి వారికి కొత్తబోట్లు, మెరుగైన నష్టపరిహారం అందించి ఆదుకోవాలి అని కోరారు. అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి...మరోసారి ఇటువంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టాల్సిందిగా నారా లోకేశ్ ప్రభుత్వాన్ని కోరారు.

గాఢనిద్రలో ఉండగా ప్రమాదం

ఇకపోతే పగలు అంతా వేటాడి అలసిపోయిన గంగపుత్రులు గాఢనిద్రలోకి జారుకున్నారు. అయితే అర్థరాత్రి ఊహించని రీతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫిషింగ్ హార్బర్‌లో నిలిపి ఉన్న ఓబోటులో ప్రారంభమైన మంటలు రెప్పపాటులో మిగిలిన బోట్లన్నింటికి వ్యాపించాయి. మత్స్యకారులుఈ ప్రమాదాన్ని గమనించే సరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. దాదాపు 45కిపైగా బోట్లు కాలి బూడిదయ్యాయి. కోట్లలో నష్టం వాటిల్లింది. విశాఖకు చెందిన మత్స్యకారులకు చేపలవేటే జీవనాధారం. సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడమే వారికి తెలుసు. సముద్రంలో చేపల వేటకు మత్స్యకారులు బోట్లను ఉపయోగిస్తుంటారు. చాలా మంది మత్స్యకారులకు వేటాడటం వచ్చు కానీ సొంతంగా బోట్లు లేని పరిస్థితి. అలాంటి వారు బోట్లను అద్దెకు తీసుకువచ్చి వేటాడతారు. ఇలా పగటిపూట మత్స్యకారులంతా వేటకు వెళ్లి రాత్రిపూట బోట్లను ఫిషింగ్ హార్బర్‌లో పెట్టి సేద తీరుతారు. అలా బోట్లను పెట్టిన ఫిషింగ్ హార్బర్‌లోనే ప్రమాదం జరగడంతో గంటల వ్యవధిలో 45కి పైగా బోట్లు దగ్ధమయ్యాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed