- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాబు అంతర్మథనం.. పవన్ ప్రసంగాలతో బలపడుతున్న అధికార పార్టీ
ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలి.. ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలి.. అవసరమైతే ఎందాకైనా వెనకడుగు వేయాలి.. అని టీడీపీ అధినేత చంద్రబాబు నిశ్చయించుకున్నారు. అందుకోసం నిత్యం చోటుచేసుకుంటున్న పరిణామాలను లోతుగా పరిశీలిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో కలిసి వస్తారనుకున్న జనసేన ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. జనసేనాని వారాహి యాత్ర ద్వారా నాలుగు ఓట్లు సంపాదిస్తారనుకుంటే.. అధికార పార్టీ ఓటు బ్యాంకులను పదిలం చేసేట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు పొత్తుపై ఏ రోటికాడ ఆ పాట పాడుతున్న కమలనాథులను చూసి మరింతగా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి కీలక దశలో టీడీపీ అధినేత ఎలా ముందుకెళ్తారనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దిశ, ఏపీ బ్యూరో : గత ఎన్నికలకు ముందు బీజేపీని అంచనా వేయడంలో పొరబాటు పడినట్లు చంద్రబాబు ఓటమి తర్వాత సమీక్షించుకున్నారు. ఒకేసారి ఇద్దరు శత్రువులతో పోరాడాల్సి వచ్చినందున ఇబ్బందులు పడినట్లు గుర్తించారు. నాలుగేళ్లలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచిన కేంద్రంపై ప్రజలు కన్నెర్రజేస్తున్నారు. నిత్యావసరాలపై జీఎస్టీ విధించడంతో కస్సుమంటున్నారు. విశాఖ ఉక్కును అమ్మేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని మొండి చెయ్యి చూపడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు.
బీజేపీపై రాష్ట్ర ద్రోహి ముద్ర..
ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీగా బీజేపీ ముద్ర వేసుకుంది. ఇలాంటి సమయంలో పొత్తు పెట్టుకుంటే లాభమెంత.. నష్టమెంత అని చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. మరోవైపు పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించేట్లు చేస్తున్నారు. ఆయన ఎంచుకున్న అంశాలు, వాటిపై ప్రసంగాలు అధికార పార్టీకి లాభించేట్లున్నాయి. అసంతృప్తి వర్గాలన్నింటినీ వైసీపీ ఒడికి చేరుస్తున్నట్లున్నాయి. ఇది కాషాయ నేతల రూట్ మ్యాపులో భాగంగా పవన్ నడుస్తున్నట్లు అనుమానాలను రేకెత్తిస్తోంది. బీజేపీని కాదని పవన్ టీడీపీతో కలిసి వస్తారా.. లేదా అనే సందేహాలకు తావిస్తోంది.
ఎన్డీఏ సమావేశానికి అందని ఆహ్వానం..
ఎన్డీయే పక్షాల సమావేశం ఢిల్లీలో 18న నిర్వహిస్తున్నారు. జనసేనానికి మాత్రమే ఆహ్వానం అందింది. పాత స్నేహితుడైన చంద్రబాబుకు పిలుపు లేదు. మరోవైపు వదిన పురందేశ్వరికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. ఆమె కేవలం జనసేనతో కలిసే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. టీడీపీతో పొత్తు గురించి లేశమాత్రమైనా సంకేతాలు ఇవ్వలేదు. కేంద్ర మంత్రి నారాయణ స్వామి, మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీతో పొత్తు ఖరారైందని చెప్పుకొచ్చారు. పురందేశ్వరి, ఎంపీ జీవీఎల్ మాత్రం జనసేనతోనే పొత్తంటూ స్పష్టం చేస్తున్నారు. ఇలా తెలుగు తమ్ముళ్లను ఎన్నికలు సమీపించేదాకా గందరగోళంలో ఉంచాలనే ఎత్తుగడ అమలు చేస్తున్నట్లుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సీపీఎం నేతను తలుచుకున్న చంద్రబాబు..
ఇటీవల మీడియాతో చిట్‌చాట్ చేస్తూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి యాధృచ్చికమా.. లేక భవిష్యత్తులో కలిసి ప్రయాణం చేయాలనుకున్నారా అనేది స్పష్టం చేయలేదు. చంద్రబాబు హయాంలో సీపీఎం దివంగత ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డిని తలచుకున్నారు. రాఘవరెడ్డి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీకి ర్యాలీ నిర్వహిస్తే చంద్రబాబు శాసనసభ సమావేశాలను వాయిదా వేసి క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లినట్లు గుర్తు చేసుకున్నారు. బహుశా ముసుగు ఎత్తుగడల పార్టీలతో విసిగిన బాబు నమ్మకమైన వామపక్షాలను నమ్ముకుంటున్నారా అనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు కాషాయ నేతల నాన్చుడు ధోరణితో ఎన్నికలు సమీపించేదాకా ఆగుతారా.. ఈలోపే తాడోపేడో తేల్చుకొని కదన రంగంలోకి దూకుతారా అనే అంశాలపై అటు పార్టీల్లో.. ఇటు ప్రజల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.