జాతీయ జెండాను ఆవిష్కరించిన పార్టీల అధినేతలు..

by Sumithra |
జాతీయ జెండాను ఆవిష్కరించిన పార్టీల అధినేతలు..
X

దిశ, డైనమిక్ బ్యూరో : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రమంతా మువ్వన్నెల జెండాతో రెపరెపలాడింది. ప్రతీ ఒక్కరూ మువ్వన్నెల జెండాను పట్టుకుని స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. సామాన్యులు దగ్గర నుంచి సెలబ్రిటీలు, ప్రముఖులు జాతీయ జెండాను ఆవిష్కరించి కన్నుల పండువగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఇకపోతే ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించింది. అలాగే టీడీపీ జాతీయ కార్యాలయం, జనసేన, కాంగ్రెస్ కార్యాలయాలలో పార్టీ అధినేతలు జెండా ఎగురవేసి రాష్ట్రప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. వారి ఆశయ సాధనకోసం పనిచేయాలని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు.

జెండా ఆవిష్కరించిన గవర్నర్ బీబీ హరిచందన్

గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ' స్వాతంత్య్ర భార‌తదేశాన్ని గ‌ణ‌తంత్ర రాజ్యంగా మార్చిన‌ రాజ్యాంగం అమల్లోకి వ‌చ్చి 73 సంవ‌త్సరాలు పూర్తైన సంద‌ర్భంగా ఈ గ‌ణ‌తంత్ర దినోత్సవం నాడు మ‌న రాజ్యాంగక‌ర్తల‌ను స్మరించుకుంటూ వారి బాటలో న‌డిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దాం' అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో జరిగిన గనతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ బీబీ హరిచందన్‌తో కలిసి పాల్గొన్నారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఇచ్చే హైటీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.

రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముక వ్యవసాయం : గవర్నర్ హరిచందన్

గణతంత్ర వేడుకల్లో గవర్నర్ బీబీ హరిచందన్ కీలక ప్రసంగం చేశారు. 'నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరిగిందన్నారు. నవరత్నాల పథకాలు అర్హులందరికీ అందుతున్నాయని వెల్లడించారు. జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం, విద్యా కానుక ద్వారా ఇంటర్, డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు సాయం అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముక వ్యవసాయం. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు గవర్నర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రైతు కుటుంబాలకు ఏటా రూ.13,500 సాయం చేస్తున్నామని.. అలాగే 37 లక్షల మంది రైతులకు 'వైఎస్ఆర్ పంటల బీమా' అందిస్తున్నట్ల గవర్నర్ బీబీ హరిచందన్ తెలిపారు.

ప్రతి ఒక్కరికీ సేవ చేయాలనేదే మోడీ సంకల్పం : సోము వీర్రాజు

ప్రతి ఒక్కరికీ సేవ చేయాలనేదే ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పమని బీజేపీ రాష్ట్రఅధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోము వీర్రాజు గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ భారత దేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నాయని.. అందుకు మనకున్న రాజ్యాంగ వ్యవస్థ చాలా గొప్పదని వ్యాఖ్యానించారు. ఛాయ్ అమ్మే వారి కొడుకుని భారత ప్రధానిని చేసిందని కొనియాడారు. అలాగే ఒకశాస్త్రవేత్త అయిన అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిందని గుర్తు చేశారు. ప్రధాని మోడీ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని స్పష్టం చేశారు. మన రాజ్యాంగం వల్లే ప్రపంచంలో భారతదేశం ప్రత్యేకంగా నిలిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.

జెండా ఆవిష్కరించిన పవన్ కల్యాణ్..

గణతంత్రదినోత్సవ వేడుకలను జనసేన పార్టీ ఘనంగా నిర్వహించింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. జెండా వందనం సమర్పించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తోపాటు పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శిలు, జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. తన బిడ్డల భవిష్యత్‌ను పక్కనపెట్టి రాష్ట్రంలోని బిడ్డల భవిష్యత్ కోసం పార్టీ కార్యాలయాన్ని స్థాపించినట్లు తెలిపారు. ఫ్రీగా స్థలం ఇస్తామని చెప్పినా తాను తిరస్కరించానని సొంతఖర్చుతో జనసేన పార్టీ కార్యాలయాన్ని స్థాపించినట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా.. ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ తలుపు తడితే అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.

టీడీపీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..

మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహాత్మగాంధీజీ, డా.బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇవి కూడా చదవండి: ప్రణాళిక బద్ధంగా వెళ్తే భారత్ దే అగ్రస్థానం : చంద్రబాబు

Next Story

Most Viewed