కిర్గిజిస్థాన్‌లో చిక్కుకున్న విద్యార్థులతో మాట్లాడిన టీడీపీ నేతలు..

by Jakkula Mamatha |   ( Updated:2024-05-20 05:47:16.0  )
కిర్గిజిస్థాన్‌లో చిక్కుకున్న విద్యార్థులతో మాట్లాడిన టీడీపీ నేతలు..
X

దిశ,వెబ్‌డెస్క్:కిర్గిజి​స్థాన్ రాజధాని బిష్కెక్​లో గత మూడు రోజులుగా విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఏపీ విద్యార్థుల బాగోగులు తెలుసుకోవడానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం తెలుగుదేశం పార్లమెంటరీ ఇంఛార్జి శ్రీ భరత్, తెలుగు యువత జనరల్ సెక్రటరీ నాగ శ్రవణ్ కిలారులు బిష్కెక్​లో ఉన్న విద్యార్ధులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ క్రమంలోనే వారి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు ధైర్యంగా, సహనంతో అప్రమత్తంగా ఉండాలని, భారత దేశ ఎంబసీకి ఎప్పటికప్పుడు తమ సమాచారం ఇవ్వాలి అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశ విదేశాంగ శాఖ నుంచి పూర్తి సహాయ సహకారాలు వచ్చేవరకూ నిరంతరం కృషి చేస్తామని ఆయన విద్యార్థులకు ధైర్యం చెప్పారు. విద్యార్థులు అత్యవసరానికి తప్పితే బయటకు రాకుండా జాగ్రత్తపడాలని భరత్ సూచించారు. భారత విదేశాంగ శాఖ ద్వారా వారికి అన్ని సహకారాలు అందించే విధంగా తెలుగుదేశం పార్టీ ద్వారా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని, విద్యార్థులు మనో ధైర్యంతో ఉండాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed