రాజకీయాల్లోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు?.. ఆ పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్

by Seetharam |   ( Updated:2023-08-30 07:46:08.0  )
రాజకీయాల్లోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు?.. ఆ పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ ఘట్టమనేని మహేశ్ బాబు పొలిటికల్ ఎంట్రీ షురూ అయ్యిందా? ఈ ఏడాదే రాజకీయాల్లోకి మహేశ్ బాబు రంగ ప్రవేశం చేయబోతున్నారా? వెండితెరపై పొలిటీషియన్‌గా సక్సెస్ అయిన మహేశ్ బాబు ఇక నిజ జీవితంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారా? ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రిన్స్ మహేశ్ బాబు ఇక రాజకీయం వేదికగా రాష్ట్ర ప్రజలకు సేవ చేయబోతున్నారా? ఇవే ప్రశ్నలు అటు సినీ సర్కిల్స్ ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ప్రశ్నలు. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు ఈ ఏడాది సెప్టెంబర్ 2న వైసీపీలోకి చేరేందుకు సిద్ధమైన మహేశ్ బాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ ప్రచారం వెనుక వాస్తవమెంత? ఇది కేవలం పుకారే అని కొందరు.. కాదు వాస్తవమేనని మరికొందరు సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంతకీ మహేశ్ బాబు రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా? ప్రిన్స్ ఆలోచన ఏంటి? పాలిటిక్స్‌పై మహేశ్ బాబు ఒపీనియన్ ఏంటో ఓ సారి చూద్దాం.

గుండె ఆపరేషన్లతో ఎందరికో పునర్జన్మ

ప్రిన్స్ మహేశ్ బాబు..ఈ పేరు తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా తెలియనివారు ఉండరు. సినీరంగంలో అగ్రనటుడుగా వెలుగొందుతున్నారు. ఒకవైపు నటుడుగా ప్రజలను మెప్పిస్తూనే మరోవైపు అనేక సేవా కార్యక్రమాలతో దైవం మనుష్యరూపేణా అంటూ కొలవబడుతున్నారు. అయితే మహేశ్ బాబు రాజకీయాల్లోకి వస్తారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘భరత్ అనే నేను’మూవీలో ముఖ్యమంత్రి పాత్రలో నటించి మెప్పించారు. తండ్రి మరణం అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి అవుతారు. ఆ తర్వాత తన తండ్రి మరణం వెనుక మిస్టరీని తెలుసుకోవడం..అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య ప్రజలు నలిగిపోతున్న దృశ్యాలను చూసి తన రాజకీయ చదరంగానికి పదును పెడతారు. ప్రజల మద్దతుతో సీఎం అవుతారు. వెండితెరపై ముఖ్యమంత్రిగా అలరించిన ప్రిన్స్ మహేశ్ బాబు నిజ జీవితంలో కూడా అలానే మెప్పిస్తాడని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఇకపోతే ప్రిన్స్ మహేశ్ బాబు ఒకవైపు సినిమాలు తీస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. ఆంధ్రచిల్ట్రన్స్ ఆస్పత్రిలో వేలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి ఎందరికో పునర్జన్మ ప్రసాదించారు మహేశ్ బాబు. అలాగే తన తండ్రి దివంగత సూపర్ స్టార్ కృష్ణ జన్మించిన బుర్రిపాలెం ఊరును దత్తత తీసుకున్నారు. వరుస షూటింగ్‌లతో బిజీబిజీగా గడిపే సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏనాడూ తన సొంతూరైన గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని మరచిపోలేదు. దత్తత తీసుకున్న అనంతరం గ్రామం రూపురేఖలను మార్చేశారు. తన సొంత నిధులతో బుర్రిపాలెంలో రహదారులు నిర్మించడం, తన తనయ సితార చేతుల మీదుగా సైకిళ్ల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. సినీ పరిశ్రమ తనకిచ్చిన స్టార్ డమ్‌తో ప్రజలకు చేతనైనంత సాయం చేయాలని పరితపిస్తుంటారు ప్రిన్స్ మహేశ్ బాబు. అదే రాజకీయాల్లోకి వస్తే మరింత సేవ చేసే అవకాశం ప్రిన్స్‌కు ఉంటుందని అభిమానులుకోరుకుంటున్నారు.

కుటుంబ రాజకీయ నేపథ్యం ఇదీ

సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబానికి రాజకీయ నేపథ్యం సైతం ఉంది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ‌ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలు పొందారు. అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకపోయినప్పటికీ మరణించే వరకు కాంగ్రెస్ వాదిగానే కృష్ణ ఉన్నారు. మరోవైపు ప్రిన్స్ మహేశ్ బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరి రావు కూడా రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు అనంతరం టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇదిలా ఉంటే మహేశ్ బాబు బావ గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే వరుసకు సోదరుడు అయినటువంటి సీనియర్ నటుడు నరేశ్ సైతం రాజకీయాల్లో ఉన్నారు. బీజేపీ సభ్యుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

రాజకీయాలకు దూరం

ఇకపోతే రాజకీయాల్లోకి మహేశ్ బాబు ప్రవేశించే ప్రశ్నే లేదని తెలుస్తోంది. రాజకీయాలు తనకు సరిపడవని ఇప్పటికే మహేశ్ బాబు ప్రకటించేశారు. అదే స్టాండ్‌పై నిలబడతారని మహేశ్ బాబుకు అత్యంత సన్నిహితులు చెప్తున్నారు. రాజకీయాలపై ఆసక్తి లేదని గతంలోనే తెలిపారని గుర్తు చేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలన్నది తన లక్ష్యం అని అయిలే అది మరో రకంగా ప్రజా సేవ చేస్తాను కానీ రాజకీయాల్లోకి మాత్రం రాను అని మహేశ్ బాబు భరత్ అనే నేను మూవీ ప్రమోషన్లో తేల్చి చెప్పేశారు. వందేళ్లు సినీ ఇండస్ట్రీలో ఉండాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రిన్స్ మహేశ్ బాబు క్రమశిక్షణకు మారుపేరు. ప్రస్తుతం సినిమాలు, డబ్బు సంపాదనపైనే మహేశ్ బాబు ఫుల్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. మహేశ్ బాబు సినీ కెరీర్ పీక్స్‌లో ఉంది. ఇటీవల కాలంగా వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీస్తున్నారు. సినీ కెరీర్‌ను మరింత మెరుగుపరచుకోవాలని.. మరింత దూకుడుగా వెళ్లాలని భావిస్తున్నారు. మరోవైపు ఇద్దరు పిల్లలు అంటే సితార, గౌతమ్‌లు కెరీర్‌పైనా ప్రత్యేక ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో రాజకీయాల్లోకి అడుగు పెడితే అటు తన కెరీర్‌తోపాటు పిల్లల కెరీర్‌ కూడా దెబ్బతింటుందని మహేశ్ బాబు, అటు నమ్రతల ఆలోచన అని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయాలకు తాము దూరమని ఇప్పటికే ప్రిన్స్ మహేశ్ బాబు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story