ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక కృషి : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

by samatah |
ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక కృషి : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్గదర్శనంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమానికి టీటీడీ ప్రత్యేక కృషి చేస్తోందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని వినాయకనగర్ టీటీడీ క్వార్ట్రర్స్‌లో ఉద్యోగుల కోసం రూ.1.40 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను గురువారం వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ఉద్యోగుల 20 ఏళ్ళ కల అయిన ఇంటిస్థలాలను సాకారం చేసినట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశంతో 300 ఎకరాల భూమి సేకరించి ఇందుకు అవసరమైన సొమ్ము జిల్లా కలెక్టర్‌కు చెల్లించామని తెలిపారు. భూమి చదును చేసి అభివృద్ధి చేసి ఉద్యోగులకు ఇంటి స్థలాలు అందించే ప్రక్రియ జరుగుతోందని ప్రకటించారు. ఉద్యోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు పొందేందుకు ఈ హెచ్ ఎస్ అమలు చేస్తున్నామని..అలాగే ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా ఫంక్షన్ హాల్ నిర్మించామని, ఇక్కడ వంటగది, వాష్ రూములు , విశాలమైన ప్రాంగణం ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులు మరింతగా భక్తులకు సేవ చేయాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు.

పారిశుధ్య కార్మికుల సమ్మె సరికాదు

భక్తులకు ఇబ్బంది కలిగించేలా సులభ్ పారిశుధ్య కార్మికుల సమ్మెకు దిగడం సరైంది కాదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ముందస్తు నోటీసు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయంపై టీటీడీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అధికారులు, ఉద్యోగులు భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ వెల్లడించారు. ఇదే సందర్భంలో కార్మికుల బెదిరింపులను టీటీడీ లెక్క చేయదనే విషయం గుర్తించాలన్నారు. మరోవైపు భక్తులను మోసగించేలా కొన్ని ఫేక్ వెబ్సైట్లు వ్యవహరిస్తున్నాయని అలాంటి వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంట టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, జేఈవోలుసదాభార్గవి, వీరబ్రహ్మం, సీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story