జడ్జిపై ట్రోలింగ్: బుద్దా వెంకన్న సహా 26 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు

by Seetharam |   ( Updated:2023-09-27 06:43:01.0  )
జడ్జిపై ట్రోలింగ్: బుద్దా వెంకన్న సహా 26 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : సోషల్ మీడియాను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. సమాచారం సేకరించడంతోపాటు షేర్ చేయడానికి వేదికగా వాడుకోవాలి. అంతేగానీ సోషల్ మీడియా వాడకం తెలుసుకదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అడ్డంగా బుక్కైనట్లే. ఇలాంటి పరిస్థితి ఏపీలోని టీడీపీ నేతలతోపాటు పార్టీ సానుభూతిపరులు కూడా అడ్డంగా బుక్కయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్, రిమాండ్‌ను నిరసిస్తూ పలువురు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. ఏకంగా కొంతమంది నేతలు సోషల్ మీడియా వేదికగా జడ్జి హిమబిందుతోపాటు పలువురు న్యాయవాదనులను ట్రోల్స్ చేశారు. అంతేకాదు అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. ఈ ట్రోల్స్‌ను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఏజీ శ్రీరాం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ అంశంపై బుధవారం విచారణ జరిగింది. క్రిమినల్ కంటెప్ట్ పిటిషన్‌లో 26 మందికి నోటీసులు ఇవ్వాలని ఏపీ హైకోర్టు నిర్ణయించింది. టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సహా 26 మందికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి..26 మందికి నోటీసులు ఇవ్వాలని ఏపీ డీజీపీకి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


హైకోర్టులో ఏజీ కోర్టు ధిక్కరణ పిటిషన్

ఇకపోతే స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ చేసినా అన్యాయంగా జైలుకు పంపారని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు. ఈ క్రమంలో జడ్జిలపై తీవ్రస్థాయిలో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ శ్రీరాం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై దూషణల వ్యవహారంలో క్రిమినల్ కంటెంప్ట్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్‌ ముందు మెన్షన్ చేశారు. ఈ క్రిమినల్ కంటెప్ట్‌ వ్యవహారంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఏజీ శ్రీరాం కోరారు. అయితే ఈ పిటిషన్‌పై బుధవారం ఏపీ హెకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు 26 మందికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.

రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదేశాలు

స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం కేసును విజయవాడ ఏసీబీ కోర్టు విచారిస్తోంది. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. రిమాండ్ విధించిన అనంతరం జడ్జి హిమబిందును కించపరుస్తూ పలువురు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. అంతేకాదు విపరీతంగా ట్రోల్స్ చేశారు. దీనిపై కొందరు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. జడ్జి హిమబిందుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై పట్ల ఫిర్యాదు చేశారు. ట్రోల్స్ చేయడం వల్ల ఆమె హోదా, గౌరవాన్ని కించపరిచినట్టుగా అవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఒక జడ్జి వ్యక్తిత్వాన్ని కించపరి చేసేలా ట్రోల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. ఈ ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా కీలక ఆదేశాలిచ్చారు. జడ్జి హిమబిందుపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పీసీ మీనా ఏపీ సీఎస్‌ జవహర్ రెడ్డిని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed