జనసేనకు బిగ్ షాక్: వైసీపీలో చేరిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి

by Seetharam |   ( Updated:2023-10-13 10:37:59.0  )
జనసేనకు బిగ్ షాక్: వైసీపీలో చేరిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి గట్టి షాక్ తగిలింది. జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలే జనసేన పార్టీకి రాజీనామా చేసిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలతో కలిసి వైసీపీలో చేరారు. వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి కేతంరెడ్డి వినోద్ రెడ్డికి మెడలో వైసీపీ కండవా వేసి సాదరంగా ఆహ్వానించారు. కేతంరెడ్డి వినోద్ రెడ్డితోపాటు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులు, డివిజన్ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు వందలాది మంది వైసీపీలో చేరారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సమక్షంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి అనుచరులు, కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని నేతలు కేతంరెడ్డి వినోద్ రెడ్డికి సూచించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని అందరి నేతలతో కలుపుకుని ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలను.. లక్ష్యాలను నెరవేర్చేందుకు కృషి చేయాలని సూచించారు. మరోవైపు కేతంరెడ్డి వినోద్ రెడ్డి వైసీపీలో చేరడాన్ని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి స్వాగతించారు. వినోద్ రెడ్డిలాంటి వ్యక్తులు వైసీపీలో ఉంటే మంచిదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కేతంరెడ్డి వినోద్ రెడ్డికి తన అండదండలు ఉంటాయని.... వైసీపీలో మంచి భవిష్యత్ ఉంటుందని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఇటీవలే జనసేనకు రాజీనామా

ఇదిలా ఉంటే ఇటీవలే కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేన పార్టీకి రాజీనామా చేశారు. జనసేన పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అయినప్పటికీ అవన్నీ భరించినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మాజీమంత్రి నారాయణకు మద్దతుగా ఉండాలని... టికెట్ లేదని జనసేన అధిష్టానం చెప్పడం తనను కలచివేసిందని అన్నారు. గత ఎన్నికల్లో మాజీమంత్రి నారాయణ అక్రమాలపై పోరాటం చేసిన తాను ఇప్పుడు అదే వ్యక్తికి మద్దతుగా నిలవాలని నేతలు సూచించడంతో ఆత్మాభిమానం చంపుకోలేక తాను జనసేన పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన పవన కల్యాణ్‌కు ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story