రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు.. మత్తులో జోగుతున్న యువత, ప్రజలు

by Mahesh |   ( Updated:2023-02-07 06:03:47.0  )
రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు.. మత్తులో జోగుతున్న యువత, ప్రజలు
X

దిశ, ఏపీ బ్యూరో: అది సికింద్రాబాద్- రేపల్లె ఎక్స్‌ప్రెస్‌. ఎదురు సీట్లో కూర్చున్న ఆమె కన్నీళ్లు ఆగడం లేదు. తోటి ప్రయాణికులు చూస్తారని పమిట చెంగు మొహానికి అడ్డం పెట్టుకుంది. కన్నబిడ్డను తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎదురుగా కూర్చున్న ప్రయాణికుడు ఉండబట్టలేక అడిగాడు. 'కష్టమేంటో చెప్పు తల్లీ. వీలైతే సహాయం చేస్తా. తోటి మనుషులకు సాయం చేయలేని మనిషి జన్మ ఎందుకు?' అన్నాడు. ఆయన్ని చూడగానే సమస్య చెప్పాలనిపించింది. గంజాయికి బానిసైన కుమారుడ్ని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదని రోదించింది. వివరాలు చెప్పమని అడిగాడు. ఆమె ఆవేదనకు అక్షరాలు కూరిస్తే..

మాది పల్నాడు జిల్లా పిడుగురాళ్ల. ఇద్దరు మగ పిల్లలు. మా ఆయనకు కిరాణా కొట్టుంది. జీవితం హాయిగా సాగిపోతోంది. తొమ్మిదో తరగతి చదువుతున్న పెద్దోడు లో ఏదో తేడా కొడుతోంది. ఒక్కో రోజు రాత్రి ఎప్పటికో ఇంటికొస్తాడు. ఏంటని అడిగితే ఏం మాట్లాడడు. గమ్మునెళ్లి పడుకుంటాడు. ఏం తినడు. కనీసం నీళ్లయినా తాగడు. మాకు అర్థం కాలేదు. వాళ్ల నాన్న పదే పదే గదమాయించి అడిగితే కళ్లురిమి చూసేవాడు. ఏం చెప్పేవాడు కాదు.

కొద్ది రోజుల్లోనే వాడి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఓ రోజు తూగుతూ ఇంటికొచ్చిన వాడ్ని మంచం మీద పడుకోబెట్టాను. ఏందిలా ఉన్నావు నాన్నా అనడిగా. గంజాయి తాగినట్లు చెప్పాడు. మద్యం తాగాడేమోననుకున్నా. 'మద్యంలో ఏముంది మమ్మీ. గంజాయి తాగితే స్వర్గంలో తేలాడుతున్నట్లుంటుంది' అని చెప్పాడు. ఆ తల్లి గుండె పగిలినట్లయింది. ఇంత చిన్న వయస్సులో గంజాయికి ఎలా అలవాటు పడ్డాడో తెలియక ఆ దంపతులు కుమిలిపోయారు.

అక్కడ నుంచి మకాం మారిస్తే పెద్దోడు మారతాడని అనుకున్నాం. అనుకున్న వెంటనే హైదరాబాద్‌లో ఉంటున్న మా అన్నకు చెప్పా. ఆయన అక్కడ ఉండటానికి వసతి ఏర్పాటు చేశారు. పిల్లలిద్దర్నీ తీసుకొని కాపురం హైదరాబాద్‌లో పెట్టాం. మా ఆయన ఓలా ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఓ మూడు నెలలైంది. మళ్లీ పెద్దోడిలో ఏదో మార్పు కనిపిస్తుంది. సరిగ్గా తినడం లేదు. నిద్ర పోవడం లేదు.

తాను ఇక అక్కడ ఉండలేనని కాళ్లావేళ్లా పడ్డాడు. పరుపు మీద పడుకుంటే నిద్ర పట్టడం లేదన్నాడు. బండలపైన, అరుగు మీద పడుకుంటేనే నిద్రొస్తుందని చెప్పాడు. రెండొందలు చార్జీకిస్తే పిడుగురాళ్ల వెళ్లిపోతానన్నాడు. లేకుంటే సచ్చిపోతానన్నాడు. డబ్బులిచ్చి పంపా. మళ్లీ వాడెలా ఉన్నాడో ఉండబట్టలేక పిడుగురాళ్ల వెళ్తున్నా. నా బిడ్డను కాపాడు కోవడానికి ఏదైనా మార్గం చెప్పండి సార్!

ఇది ఆమె ఒక్క కన్నీటి కథే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎందరో కన్నవాళ్లు బిడ్డలు నాశనమవుతుంటే ఏం చేయలేక మౌనంగా రోదిస్తున్నారు. గతంలోనూ గంజాయి దొరికేది. ఎక్కడో సాధువులకు ఊరి చివర ఉండే కొద్దిమంది రహస్యంగా విక్రయించేది. గంజాయికి అలవాటు పడిన కొద్దిమంది వాళ్లకు అమ్మేదెవరో తెలిసిపోతుంది. గంజాయి విక్రయించే వాళ్ల పుట్టుపూర్వోత్తరాలు మొత్తం పోలీసులకు తెలిసిపోయేది. దీంతో పోలీసులు నిఘా పెట్టి అప్పుడప్పుడూ వాళ్లను అరెస్టు చేసి జైలుకు పంపేది. ఇప్పుడు సీన్​మారిపోయింది.

గంజాయి విక్రయాలు పెంచుకునేందుకు పదిహేనేళ్ల పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రధానంగా పాఠశాలలు, కాలేజీలను అడ్డాగా చేసుకొని గంజాయి విక్రేతలు రెచ్చిపోతున్నారు. గంజాయి అమ్మకాలను పసిగట్టి అడ్డుకోవాల్సిన అబ్కారీ శాఖ సిబ్బంది మద్యం మార్కెటింగ్‌లో బిజీ అయ్యారు. ప్రభుత్వ మద్యం దుకాణాలకు వచ్చే బ్రాండెడ్​సరుకును బార్లకు తరలించి సొమ్ము చేసుకోవడంలో వాళ్లకు క్షణం తీరిక లేదు. ప్రతినెలా మద్యం విక్రయాలు పెంచాలని ఉన్నతాధికారులు సిబ్బందిపై ఒత్తిడి చేస్తుండడంతో వాళ్లు గంజాయి విక్రేతలపై దృష్టి పెట్టే సమయం ఉండడం లేదు.

పోలీసుల పరిస్థితీ అంతే. నిరంతరం అధికార పార్టీ నాయకుల సేవలో తరించడానికే వారికి సమయం సరిపోవడం లేదు. ఇక గంజాయి అమ్మే వారిపై నిఘా పెట్టే సమయమే లేదు. పైగా గంజాయి అమ్ముతున్న వాళ్లది పెద్ద సిండికేట్. అదో చైన్​ సిస్టంలా ఉంటుంది. రాజకీయంగా పెద్దవాళ్ల సహకారం ఉంటుంది. ఎవరినైనా పోలీసులు పట్టుకున్న పెద్దల నుంచి ఫోన్లు వస్తాయి. దీంతో పోలీసులు కూడా చేతులు ముడుచుకోవాల్సి వస్తుంది.

ఆమె కుమారుడ్ని రిహాబిలిటేషన్​సెంటర్‌కు పంపుతాం

బాధితురాలు తన కుమారుడితో వచ్చి కలిసి వివరాలిస్తే అడిక్ట్ ​అయిన బాలుడ్ని రిహాబిలిటేషన్​సెంటర్‌కు పంపే ఏర్పాట్లు చేస్తాం. ఎక్కడెక్కడ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయో దృష్టి పెట్టి పోలీసులతో దాడులు చేయిస్తాం. ప్రధానంగా విద్యాసంస్థల పరిసరాల్లో పోలీసు నిఘా పెంచే ఏర్పాటు చేస్తాం. గంజాయి విక్రేతలు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు.- మురళి, ఆర్డీవో, గురజాల, పల్నాడు జిల్లా

Advertisement

Next Story