Breaking:ఆంధ్రప్రదేశ్ పరిపాలన గురించి ఒక్క మాటలో చెప్పిన పురంధేశ్వరి..

by Indraja |
Breaking:ఆంధ్రప్రదేశ్ పరిపాలన గురించి ఒక్క మాటలో చెప్పిన పురంధేశ్వరి..
X

దిశ డైనమిక్ బ్యూరో: ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న 2024 ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపేలా ఎన్నికల సమర శంఖం పూరించామని పేర్కొన్నారు. ఏక కాలంలో 25 పార్లమెంట్ కార్యాలయాలు ఏర్పాటు చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని.. ఇది దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని హర్షం వ్యక్తం చేశారు.

బీజేపీ కార్యకర్తలను గౌరవప్రదంగా చూస్తుంది పార్టీని కొనియాడారు. ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో మొదలైన బీజేపీ ప్రస్థానం ఈ రోజు అధికారం లోకి వచ్చి ప్రజలకు సేవలు అందించే స్థాయికి చేరిందని తెలిపారు. 1,300 ప్రాంతీయ, 7 జాతీయ పార్టీలన్నింటిలోకి బీజేపీ భిన్నమైందని పేర్కొన్నారు. మొదట్లో వ్యతిరేకతను ఎదుర్కొన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కూడా చివరికి బీజేపీ విజయ పతాకం ఎగరవేసిందని వెల్లడించారు.

బీజేపీ అధికారం లోకి రాక ముందు దేశంలో స్కాంలు మాత్రమే ఉండేవని.. బీజేపీ అధికారం లోకి వచ్చాకే స్కాంలు కనుమరుగై పేదల సంక్షేమం కోసం స్కీమ్‌లు వచ్చాయని పేర్కొన్నారు. బీజేపీ అధికారం లోకి వచ్చిన 10 ఏళ్ళ కాలంలో అవినీతిరాహిత్య పరిపాలనను అదించిందని.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 350 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారని పేర్కొన్నారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్ పరిపాలన పై దృష్టిసారించిన భువనేశ్వరీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో విద్వేష, విధ్వంసకర పరిపాలన చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ అధికార ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఏపీలో దేవాలయాలను కూల్చివేయడం ఆ దేవాలయాలలోని విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి దుశ్చర్యలకు అధికార ప్రభుత్వం ఒడిగడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఎవరైన వైసీపీ దురాగతాలపై గళం విప్పితే వారిపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సామాజిక సాధికార యాత్ర చేసే నైతిక హక్కు వైసీపీకి లేదని వ్యాఖ్యానించారు. బాపట్లలో అక్కని కాపాడుకుందామని వెళ్లిన బీసీ కులానికి చెందిన చిన్న బిడ్డను కాల్చి చంపిన కిరాతక పాలనా వైసీపీది అని ఆవేదన వ్యక్తంచేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలపై ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక తలకాయ లేని మొండెంలా రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ఉందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని అని భావించిన కేంద్రం అమరావతి కోసం నిధులు, రోడ్లు మంజూరు చేసిందన్నారు. అలానే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన తర్వాత ప్రతి రూపాయి కేంద్రమే ఖర్చు చేసిందని.. టీడీపీ హయాంలో ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం జరిగినా కాంట్రాక్టర్ ను తొలగించకుండా జాప్యం చేసిందని పేర్కొన్నారు.

ఇక ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారని.. తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు, నాయకులు చేసి బీజేపీపై విమర్శలు చేయడం సబబు కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు .

Advertisement

Next Story

Most Viewed