- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి.. టీడీపీతో పొత్తుకా.. చిత్తుకా ?
రాష్ట్ర రాజకీయాల్లో హస్తిన సెగలు పుట్టిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ ఎత్తుగడలు ఇక్కడ ప్రాంతీయ పార్టీల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియామకంతో పలు ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. టీడీపీని కలుపుకుపోయేందుకా.. దెబ్బ కొట్టేందుకా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల జనసేనాని పొత్తుల గురించి స్వరం మార్చడం వెనుక కాషాయ పార్టీ ఎత్తుగడ ఉందనిపిస్తోంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఊపుమీద ఉన్న కాంగ్రెస్.. షర్మిలను పీసీసీకి తీసుకోవాలని పావులు కదుపుతోంది. ఆమె తెలంగాణకే పరిమితమవుతానంటే అక్కడి నాయకులు ససేమిరా అంటున్నారు. ఒక వేళ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్‌లోకి వస్తే వైసీపీ మీద ప్రభావం ఎలా ఉంటుందనేది ఆ పార్టీ శ్రేణులకు కునుకు పట్టకుండా చేస్తోంది. ఈ పరిణామాలన్నింటి మధ్య సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో భేటీ ఆంతర్యం ఏమై ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దిశ, ఏపీ బ్యూరో : దేశ వ్యాప్తంగా కమలనాథుల ప్రతిష్ట మసకబారింది. కర్నాటక తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌లో ఓటమితో కంగారు పడుతోంది. పొరుగునున్న తెలంగాణలో ఎన్ని ఎత్తుగడలు వేసినా మూడో స్థానానికి జారిపోయేట్లుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ దఫా సీట్లు తగ్గుతాయని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీనికితోడు విపక్షాలన్నీ ఏకతాటి మీదకు వచ్చి బీజేపీని ఎదుర్కోవడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలనే వ్యూహంతో రాష్ట్ర రథసారధిని మార్చినట్లు తెలుస్తోంది. దగ్గుబాటి పురందేశ్వరిని చీఫ్‌గా నియమించడం టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న కమ్మ సామాజిక వర్గంలో చీలిక తేవడం కోసమేనని స్పష్టమవుతోంది.
టీడీపీని దెబ్బతీసే ఎత్తుగడ?
గతంలో అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. ఆయన్ని కూడా బీజేపీ వైపు లాగే అవకాశముంది. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఇద్దరు ప్రముఖులు వస్తే టీడీపీకి గండి పడినట్లే. అవసరమైతే మెగాస్టార్‌ను కూడా రంగంలోకి దించే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల జనసేనాని పొత్తుల సంగతి ఇంకా తేల్చుకోలేదని చెప్పడం వెనుక మర్మం ఇదే అయి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ, జనసేన కలిసి కనీసం కొన్ని సీట్లయినా సాధించుకొని టీడీపీని కోలుకోలేని దెబ్బతీసే ఎత్తుగడ కావొచ్చని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.
షర్మిల ఏపీకి వస్తే..
మరోవైపు రాహుల్ గాంధీ పాల్గొన్న ఖమ్మం సభకు జనం పోటెత్తడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వైఎస్సార్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు.. గన్నవరం విమానాశ్రయంలో రాహుల్ గాంధీని కలిసిన తర్వాత షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె తెలంగాణ వరకే పరిమితమవుతానంటే అక్కడ నాయకులు అంగీకరించడం లేదు. ఏపీసీసీ బాధ్యతలు అప్పగిస్తే కనీసం కొన్ని సీట్లయినా సాధించగలమని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. షర్మిల ఇక్కడ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే వైసీపీ విజయావకాశాలకు గండి కొట్టే ప్రమాదం ఉందని ఆ పార్టీ శ్రేణుల్లో గుబులు నెలకొంది.
జగన్ ఢిల్లీ టూర్ అందుకేనా..
ఈ పరిణామాల మధ్య సీఎం జగన్ బుధ, గురువారాల్లో ఢిల్లీ పెద్దలతో భేటీ అవుతున్నారు. తెలంగాణతోపాటే ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ ఉండగానే ఎన్నికలకు వెళ్తే ప్రయోజనమని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరో పది నెలలపాటు పథకాలకు నిధుల కొరత ఉంది. ఇప్పటికే అప్పుల పరిమితి ముగిసింది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ ముందస్తుకే ప్రాధాన్యం ఇవ్వొచ్చు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రం మీద పోటాపోటీగా దృష్టి కేంద్రీకరిస్తే రాజకీయ సమీకరణాల్లో పెను మార్పులు తప్పవని విశ్లేషకుల అంచనా.
Read More..