గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది : కాంట్రాక్టు లెక్చరర్స్

by M.Rajitha |
గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది : కాంట్రాక్టు లెక్చరర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏళ్ల తరబడి ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేసి తగు న్యాయం చేయాలని కోరారు ఏపీ కాంట్రాక్టు లెక్చరర్స్. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మోసపూరిత యాక్ట్ 30 వల్ల ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తమ బాధలు చెప్పుకొనేందుకు కాంట్రాక్టు లెక్చరర్స్ సోమవారం జనసేన కేంద్ర కార్యాలయానికి తరలివచ్చారు. ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ జేఏసీ నుంచి వచ్చిన అధ్యాపకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. 2000-2001 నుంచి కాంట్రాక్టు లెక్చరర్స్ గా పని చేస్తున్నామని, గత ప్రభుత్వం 177 ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న 10,117 మందిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయని వాపోయారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఒకేషనల్ అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 5 వేల మంది కాంట్రాక్టు లెక్చరర్స్ రెగ్యులరైజ్ కావడానికి అన్ని అర్హతలున్నా, అప్పటి ప్రభుత్వం రేపు మాపు అంటూ దాటవేసిందన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా ప్రస్తుతం ఇచ్చే నోటిఫికేషన్ కు ముందు కాంట్రాక్టు లెక్చరర్స్ పని చేస్తున్న పోస్టులను మినహాయించేలా చూడాలని కోరారు. కాంట్రాక్టు లెక్చరర్స్ రెగ్యులరైజ్ చేసే విషయమై ప్రస్తుత ప్రభుత్వం న్యాయపరమైన సలహా తీసుకునేందుకు ఏజీ దగ్గర ఫైల్ పెట్టిందని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ఏజీ సాంబశివ ప్రతాప్ కు ఫోన్ చేసి.. ప్రభుత్వం కోరిన నివేదిక ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టు లెక్చరర్స్ ను రెగ్యులరైజ్ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు.

Advertisement

Next Story