- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nara lokesh: సంతనూతలపాడు ఎమ్మెల్యేపై లోకేష్ తీవ్ర ఆరోపణలు
దిశ, ఏపీ బ్యూరో: ఎన్ని కోట్లు ఖర్చయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులను ఉచితంగా డాక్టర్ చేస్తానని మాయమాటలు చెప్పాడని, ఇప్పుడేమో మెడికల్ సీట్లను బజారులో అమ్మేస్తున్నాడని, జగన్ ది మాయా బజార్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం ఆయన సంతనూతలపాడు నియోజకవర్గంలో పర్యటించారు. చీమకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ ఇప్పటిదాకా కన్వీనర్ కోటాలో ఏడాదికి రూ.15 వేల ఫీజు ఉందని, జగన్ సర్కారు ఏడాదికి రూ.20 లక్షలకు పెంచిందని విమర్శించారు. ఒక్క సీటుకు కోటి రూపాయలు పెట్టి పేద బహుజన విద్యార్థులు వైద్య విద్యను చదువుకోగలరా అని ప్రశ్నించారు. ఇతర దేశాలు, రాష్ట్రాలకు విద్యార్థుల వలసలను నివారించేందుకు ఫీజులు పెంచినట్లు వైద్య శాఖ మంత్రి రజని సమర్థించుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిర్గిస్థాన్, జార్జియా, ఫిలిప్పీన్స్, రష్యాలో మెడిసిన్ చదవడానికి ఆరేళ్లలో రూ.35 లక్షలకు మించి వ్యయం కాదని లోకేష్ వెల్లడించారు. జగన్ బాదుడును ప్రజలు నిరసించాలని లోకేష్ పిలుపునిచ్చారు.
సీఎం జగన్ పెద్ద కటింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్ అని లోకేష్ అభివర్ణించారు. జగన్ దగ్గర ఉన్న బ్లూ బటన్ నొక్కితే పథకాల లబ్దిదారుల ఖాతాల్లో పది రూపాయలు పడతాయన్నారు. రెడ్ బటన్ నొక్కితే వంద రూపాయలు ఖాతా నుంచి వెళ్లిపోతాయని లోకేష్ చమత్కరించారు. విద్యుత్ చార్జీలు తొమ్మిది సార్లు, ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు పెంచినట్లు తెలిపారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోలు, డీజిల్, నిత్యావసరాల సరకుల ధరలను పెంచేసి జగన్ బాదేస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలో వలంటీరు వచ్చి పీల్చే గాలి మీద కూడా పన్ను వేసే ప్రమాదం పొంచి ఉందని లోకేష్ హెచ్చరించారు.
తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్నా జిల్లాలో అభివృద్ధి జాడేదని నారా లోకేష్ ప్రభుత్వాన్ని నిలదీశారు. వెలుగొండ ప్రాజెక్టును అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికి ఆరు సార్లు తేదీలు మార్చారని గుర్తు చేశారు. దొనకొండ వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తే ఆ ప్రాజెక్టును అటకెక్కించారని మండిపడ్డారు. గుండ్ల కమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే మరమ్మతులు చేయకుండా నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సంతనూతలపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని సుధాకర్ బాబును గెలిపిస్తే ఆయన కలెక్షన్ బాబుగా మారిపోయాడని విమర్శించారు. చిల్లరకొట్టు నుంచి గ్రానైట్ పరిశ్రమలను కమిషన్లు బాదేస్తున్నాడని ఆరోపించారు. కలెక్షన్ బాబు అని ఆ పార్టీ కార్యకర్తలే ముద్దు పేరు పెట్టుకున్నట్లు లోకేష్ ఎద్దేవా చేశారు. సెంటు స్థలాల పేరుతో తక్కువ రేటుకు రైతుల నుంచి భూములు తీసుకొని ఎక్కువ రేటుకు అమ్మేసినట్లు చెప్పారు. చివరకు వలంటీర్ల ద్వారా సెంటు స్థలాల లబ్దిదారుల నుంచి రూ.10 వేలు కొట్టేశారని ఆరోపించారు. వాచ్ మన్, షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులను అమ్మేసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఉపాధి హామీ పనులు చేయకుండానే నిధులు మింగేసినట్లు పేర్కొన్నారు. గ్రానైట్ మైనింగ్ కంపెనీలు లారీకి రూ.5 వేలు కమిషన్ కట్టనిదే బండి కదలనివ్వరంటూ అవినీతి ఆరోపణలు చేశారు.
సీఎం జగన్ చీమకుర్తికి వచ్చినప్పుడు కరెంటు యూనిట్ రెండు రూపాయలకు ఇస్తామని చెప్పారని లోకేష్ గుర్తు చేశారు. అది ఇవ్వకపోగా అదనంగా సర్ చార్జీ మరో రూపాయి పెంచారని ఆయన తెలిపారు. రాయల్టీని 50 శాతానికి పెంచి గ్రానైట్ పరిశ్రమను కోలుకోకుండా దెబ్బ కొట్టారని లోకేష్ పేర్కొన్నారు. చీమకుర్తిలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మిస్తామన్న హామీ ఏమైందని లోకేష్ ప్రశ్నించారు. టీడీపీ అధికారానికి వచ్చిన పెంటనే గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో కాలువల పనులు పూర్తి చేస్తామన్నారు. కీర్తిపాడు, చీర్వానుప్పలపాడులో చెక్ డ్యాములు నిర్మిస్తామన్నారు. ఒంగోలు డెయిరీని తిరిగి ప్రారంభిస్తామని లోకేష్ హామీనిచ్చారు.