Prakasam: మౌనమేల మిస్టర్​ ఫర్ఫెక్ట్!

by srinivas |
Prakasam: మౌనమేల మిస్టర్​ ఫర్ఫెక్ట్!
X

దిశ, ఏపీ బ్యూరో: పని తీరును మార్చుకోకుంటే టిక్కెట్​ఇచ్చేది లేదని సీఎం జగన్​ చెప్పకనే చెప్పేశారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో తల పండిన నేతలకు ఇది మింగుడు పడడం లేదు. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వారి ఎదుట తమ పరువు తీసేస్తున్నారని తెగ ఇదై పోతున్నారట. అటు ఇటు పక్క చూపులు చూద్దామంటే కనీసం ప్రధాన ప్రతిపక్షం కూడా పలకరించడం లేదని ఆయా నేతల అనుచరుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ మారిపోతామనే బెట్టు చేయడానిక్కూడా అవకాశం లేకపోతుందని తెగ బాధపడుతున్నారట. అధికార పార్టీని బలహీన పరిచే అనేక అవకాశాలు వచ్చినా టీడీపీ అందిపుచ్చుకోలేక సెల్ఫ్​గోల్స్​ వేసుకుంటుందని తెలుగు తమ్ముళ్లు మదనపడుతున్నారు. మరి పార్టీలో స్మార్ట్​వర్క్​జరగాలని కోరుకుంటున్న మిస్టర్​ఫర్ఫెక్ట్​చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదంటూ టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.

ఎన్నికల దాకా నిరంతరం ప్రజల్లో నిలవాలని ఎమ్మెల్యేలు, ఇన్​చార్జులను సీఎం జగన్​ఆదేశించారు. గడప గడపకూ మన ప్రభుత్వం పేరిట సంక్షేమ పథకాల ప్రచారంతోపాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఈపాటికే పనులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఇన్​చార్జులతోపాటు సీనియర్లయినా సరే పాల్గొనాల్సిందేనని సీఎం చాలా కటువుగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీమంత్రి బాలినేని, మానుగుంట మహీధర్​రెడ్డిని సైతం జగన్​హెచ్చరించినట్లు సమాచారం. వీళ్లతోపాటు మొత్తం 38 ఎమ్మెల్యేలు, ఇన్​చార్జుల పనితీరు మెరుగుపడడం లేదని పెదవి విరిచారట. దీంతో ఎన్నికలు సమీపించేలోగా తమ భవితవ్యం ఏమిటో అర్థంగాక సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ ఆకర్ష్​లాంటి కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుడితే బావుండేదని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇదే విషయమై పార్టీ సీనియర్​నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

వైసీపీలో అసంతృప్తులకు గాలం వేసే ఆలోచన గురించి ఇప్పటిదాకా టీడీపీ పట్టించుకోలేదు. కింది స్థాయి కార్యకర్త నుంచి ఒక మోస్తరు నాయకులను పార్టీలోకి ఆకర్షించే కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఇలాగైతే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలం ఎలా పెరుగుతుందంటూ తమ్ముళ్లలో ఆందోళన నెలకొంది. అధికారానికి రాకుంటే జెండా మోస్తున్న నాయకులు, కార్యకర్తలను వైసీపీ మరింతగా టార్గెట్​చేస్తుందని భావిస్తున్నారు. పొలిట్​బ్యూరో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

మరోవైపు దాదాపు రెండు లక్షలకు పైగా ఉన్న వలంటీర్లలో అనేక నిస్పృహలున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. పని ఏదైనా సరే కేవలం ఐదు వేలతో కాపురాలను నెట్టుకు రావడం చాలా కష్టం. ఎంత కాలం చేసినా ఎదుగూబొదుగూ లేని పనంటూ ఆవేదన వెళ్లగక్కుతూనే ప్రభుత్వానికి కళ్లూ, చెవులుగా వ్యవహరిస్తున్నారు. వాళ్లంతా ఒకప్పుడు అధికార పార్టీ కార్యకర్తలే. పార్టీ అధికారానికి వస్తే తమ జీవితాలు బాగుపడతాయని వైసీపీ జెండా మోసినవాళ్లే. వాళ్లలో గూడు కట్టుకున్న ఆవేదనను పట్టించుకోకుండా పుండు మీద కారం చల్లినట్లు టీడీపీ అనుకూల మీడియాలో వలంటీర్లపై పెద్ద ఎత్తున కథనాలు వడ్డించారు. ఎక్కడో ఒకటీ అరా ఘటనలను నిదర్శనంగా చూపించారు. దీంతో వాళ్లలో మరింతగా అభద్రతా భావానికి గురి చేసి వైసీపీకి మరింత చేరువ చేసినట్లయింది.

ఇలా అధికార వైసీపీలో అసంతృప్తులను ప్రతిపక్ష టీడీపీ ఎందుకు పట్టించుకోవడం లేదని ఓ జిల్లా స్థాయి నాయకుడ్ని సంప్రదిస్తే.. " టీడీపీలో ఆది నుంచి పూర్తి కాలం రాజకీయాల్లో ఉన్న నేతలు ఇప్పుడు తగ్గిపోయారు. ఇప్పుడున్నోళ్లలో 90 శాతం వ్యాపార వర్గానికి చెందిన వాళ్లే. పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే వాళ్లు లాభనష్టాలు అంచనా వేసుకుంటారు. పార్టీ అధికారానికి వస్తుందనుకుంటేనే చొరవ చూపిస్తారు. లేకుంటే అంటీముట్టనట్లు వ్యవహరిస్తారు. ఇంకా ఎన్నికలకు 15 నెలల సమయం ఉంది. ఇప్పటినుంచే పార్టీలోకి చేర్చుకొని వాళ్లను నిలబెట్టుకోవాలంటే బోలెడు ఖర్చువుతుంది. అందుకోసమే వెనకాడుతున్నట్లు కనిపిస్తోంది" అంటూ వ్యాఖ్యానించాడు.

టీడీపీ దూకుడుగా వెళ్లలేక పోవడానికి మరో కారణం కూడా ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముందు సంస్థాగతంగా ఎక్కడ బలహీనంగా ఉన్నాం.. మరెక్కడ బలంగా ఉన్నామనే పరిశీలనలో పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. బలహీనంగా ఉన్నచోట మాత్రమే ఇతర పార్టీల నుంచి తీసుకోవాలని భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 120కి పైగా నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై చర్చ జరిగింది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా సమీక్షించి ఎక్కడెక్కడ ఇతర పార్టీల నేతలకు పచ్చ కండువాతో స్వాగతం పలకాలనేది నిర్ణయించవచ్చని పరిశీలకులు అంటున్నారు.

Chandrababu చీరాల పర్యటన రద్దు

Next Story

Most Viewed