- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పారిశుధ్య లోపంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.. పట్టించుకోని అధికారులు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎర్రమఠం ఎస్సీ కాలనీలో మురుగు ముందుకు కదలడం లేదు. దీనిపై పంచాయతీ ఫిర్యాదు చేస్తే చర్యలు లేవు. అనంతరం ‘జగనన్నకు చెబుదాం’ కు 1902కు ఫిర్యాదు చేశారు. అయితే పంచాయతీ కార్యదర్శి ఆరు రోజుల తర్వాత గ్రామానికి వచ్చి తప్పుడు నివేదికలు సమర్పించి సమస్యను పరిష్కరించినట్లు చూపారు. సదరు బాధితుడు గ్రామానికి ఏ అధికారి రాకుండా పనులు చేసినట్లు ఎలా తప్పుడు నివేదికలు పంపుతారంటూ మళ్లీ అర్జీని రీ ఓపెన్ చేయించారు. అయినప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. ఇలా అన్ని గ్రామాల్లోనూ సమస్యలు ప్రభుత్వ చేతగానితనాన్ని వెక్కిరిస్తున్నాయి.
దిశ, కర్నూలు ప్రతినిధి : సర్పంచులతో కలిసి పని చేసి గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన అధికారులు రాజకీయ నాయకుల కనుసన్నల్లో మసలుతున్నారు. ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. వీరి ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి జాడలు కన్పించడం లేదు. ఒకవేళ ప్రశ్నిస్తే వారిపై దాడులు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. గ్రామాల్లో ఐదారు నెలలుగా డ్రెయినేజీ మురుగునీరు నిల్వ ఉన్నా పట్టించుకునే నాథుడు లేడు.
గొంతెండుతోంది
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో, 57 మండలాలు, 921 రెవెన్యూ గ్రామాలు, 993 పంచాయతీలున్నాయి. 40.52 లక్షల జనాభా, 9.06 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉంది. ఉమ్మడి జిల్లాలో ఉండే గ్రామ పంచాయతీలు సర్పంచులు, అధికారుల పుణ్యమానీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొత్తపల్లి మండలంలోని పెద్ద గుమ్మడాపురం, గువ్వలకుంట్ల, ఎర్రమఠం, ముసలిమడుగు, సిద్దేశ్వరం, కపిలేశ్వరం, మాడుగుల, జానాల గూడెం, బలపాల తిప్ప, కొక్కెరంచ, జడ్డువారి పల్లె వంటి దాదాపు 20 గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ఆళ్లగడ్డ, చాగలమర్రి, శిరివెళ్ల, రుద్రవరం, నందికొట్కూరు, పాములపాడు, మిడ్తూరు వంటి మండలాల్లోని అనేక గ్రామాల్లో నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
దయనీయం.. పశ్చిమ ప్రాంతం
కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో మరీ దయనీయ పరిస్థితులు దాపురించాయి. నీటి కోసం యుద్ధాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పశ్చిమ ప్రాంతాలైన కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల పరిధిలో 721 గ్రామాలు ఉన్నాయి. 2011 గణాంకాల ప్రకారం గ్రామీణ జనాభా 16.55 లక్షలు ఉన్నారు. తాజాగా 17.50 లక్షలు దాటి ఉంటుందని అంచనా. ఇక్కడ 32 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) ఉన్నాయి. వీటి నిర్వహణ కోసం ఏటేటా రూ.41.63 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 229 గ్రామాలకు శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. మరో 492 గ్రామాల్లో పీడబ్ల్యూసీ పథకాలు, చేతి బోర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. రాబోయే వేసవిలో 107 గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని ఇంజనీర్లు గుర్తించారు.
అడుగంటిన భూగర్భ జలాలు
జలాలు అడుగంటి 106 బోర్లు మరమ్మతు చేయాల్సి ఉంటుంది. 91 బోర్లు ఫ్లషింగ్ చేయాలి. వేసవిలో నీటి ఎద్దడి నివారణ కోసం వివిధ పనులకు రూ.8.08 కోట్లు అవసరం కానున్నాయని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై, ఎంపీలపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టేలా చూడాలని, లేకుంటే నీటి సమస్య మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.