పత్తాలేని పవన్ కల్యాణ్.. ఏడాదిలోపు ఎన్నిక‌లొస్తే జనసేన సిద్ధమేనా?

by GSrikanth |
పత్తాలేని పవన్ కల్యాణ్.. ఏడాదిలోపు ఎన్నిక‌లొస్తే జనసేన సిద్ధమేనా?
X

దిశ‌, కాకినాడ: ఈ ఏడాది మార్చి 14న మ‌చిలీప‌ట్నంలో ద‌ద్దర‌ల్లిన స‌భ‌. క‌నురెప్పార్పకుండా జ‌న‌సేనాని మాట‌ల కోసం అర్థరాత్రి వ‌ర‌కూ కుర్చీలు వ‌ద‌ల‌ని వీరాభిమానులు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా విని దాదాపుగా నెల దాటింది. ఆయన మాట‌లు అభిమానులను వెంటాడుతూనే ఉన్నా, ఆయ‌న మాత్రం ఇప్పటి వరు ప‌త్తా లేరు. ఇటీవ‌ల ఢిల్లీలో బీజేపీ పెద్ద‌లతో భేటి త‌ర్వాత రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోయాయంటూ సోష‌ల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. ప‌వ‌న్‌ను అడ్డుకుంటోంది ఎవ‌రు? అంటూ కేడ‌ర్‌లో ఎక్కడలేని ఆందోళ‌న‌. నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌ఛార్జులుగా ఉన్నవారిలోనూ గంద‌ర‌గోళం. వెర‌సి వారాహి వ‌స్తుందా? రాదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్‌కు బాగానే క్రేజ్ వచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిత్యం ప్రజల్లో ఉండేందుకు వారాహి యాత్ర చేపట్టేందుకు ప్రణాళిక వేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చార స‌భ‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నారన్న తరుణంలో ఠక్కున బ్రేకులు పడ్డాయి. ఇదిగో వ‌స్తుంది..అదిగో వ‌స్తుంద‌ని చెప్ప‌డం తప్పితే.. ప‌వ‌న్ ఒక్కసారిగా మౌనం దాల్చడంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. షూటింగ్‌లో బీజీగా ఉన్నారని కొంద‌రు, రాజ‌కీయ ఆలోచ‌న‌కు ప‌దును పెడుతున్నార‌ని మ‌రికొంద‌రు ఇలా ఎవ‌రికి వారు న‌చ్చిన‌ట్టుగా కామెంట్లు చేస్తున్నారు. క్యాడర్ లో మంచి జోష్ ఉన్న తరుణంలో ఇంకా వారాహి రోడ్డెక్కపోవడం ఏమిటనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

బీజేపీతో మీటింగ్ తర్వాత..

ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీతో భేటి త‌ర్వాత రాజ‌కీయ స‌మీక‌రణాల విష‌యంలో మార్పులు బాగా చోటు చేసుకున్నాయి. జనసేన-టీడీపీ పొత్తు ఉంటుంద‌నే ఊహాగానాలపై నోరు మెదపడం లేదు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఒంటరి పోరు అయితేనే మేలని అంటున్నారు. సీట్ల కేటాయింపులో తేడాలొచ్చాయా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వీటన్నింటిపై క్లారీటీ రావాలంటే ప‌వ‌న్ నిత్య రాజ‌కీయాల్లోకి రావాలి. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చ‌బోమ‌నే ఒక్క మాట త‌ప్పితే, ఎక్క‌డా ఆ దిశ‌గా ఆయన ప్రయ‌త్నాలు చేయ‌డం లేదని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేసింది. కానీ, జనసేనాని మాత్రం స్పష్టత ఇవ్వడకపోతుండటంపై క్యాడర్‌లో నిరుత్సాహం ఆవహిస్తోంది.

ముంద‌స్తు వ‌స్తే ముప్పే..

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో మీనమేషాలు లెక్కించ‌డం చూస్తుంటే ముంద‌స్తు వ‌స్తే జ‌న‌సేన‌కు ముప్పు త‌ప్ప‌ద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. త‌క్కువ స‌మ‌యంలో క్యాడ‌ర్‌ను సంసిద్ధం చేయాలి. నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జిల‌కు సీట్ల విష‌యంలో క్లారిటీ ఇవ్వాలి. పొత్తు ఉంటే కోల్పోయే స్థానాలు, పోటీ చేసే స్థానాల‌పైనా స్పష్టత‌కు క‌నీసం అడుగులు కూడా ప‌డ‌టంలేదు. పైగా ప‌వ‌న్ పోటీ చేసే స్థానం ఏదని ప్రకటన కూడా రాలేదు. గ‌తంలో ప‌వ‌న్ ఓట‌మి దృష్ట్యా ముంద‌స్తుగా అంచ‌నాలు వేసుకోక‌పోతే ఎన్నిక‌లు క‌ష్టత‌రంగా మార‌తాయ‌నేది జ‌న‌సైనికుల ఆందోళ‌న‌ చెందుతున్నారు. ఏడాది లోపు మాత్రం ఎన్నిక‌లొస్తే వీట‌న్నింటికి జ‌న‌సేన సిద్ధమేనా అంటే.. ఎవ్వరినోట‌ మాట రావ‌డం లేదు.

Advertisement

Next Story