దేశవ్యాప్తంగా ఉత్కంఠ: చంద్రబాబుకు సుప్రీంకోర్టులోనైనా రిలీఫ్ దొరికేనా?

by Seetharam |   ( Updated:2023-10-20 11:00:26.0  )
దేశవ్యాప్తంగా ఉత్కంఠ: చంద్రబాబుకు సుప్రీంకోర్టులోనైనా రిలీఫ్ దొరికేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు దేశంలోని ప్రముఖుల చూపంతా అటు వైపే. సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది. చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తోందా? మళ్లీ వాయిదా వేస్తోందా? అసలు క్వాష్ పిటిషన్‌లో చంద్రబాబుకు ఉపశమనం జరుగుతుందా? అసలు సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది? అసలు ఈ కేసులో సీఐడీ గెలుస్తోందా? చంద్రబాబు నాయుడు గెలుస్తారా? ఇవే అందరి మదిని తొలిచివేస్తోన్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికి ఏకైక సమాధానం ఇవ్వాల్సింది సుప్రీంకోర్టు మాత్రమే. నేడు మధ్యాహ్నాం చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసు నుంచి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా జైలు నుంచి విడుదల అవుతారా లేకపోతే డిసెంబర్ వరకు అంతేనా? అనే ప్రశ్నల చిక్కుముడిని నేడు సుప్రీంకోర్టు విప్పనుంది. దీంతో చంద్రబాబు నాయుడు కేసులో ఏం జరగబోతుందోనన్న ఆందోళన అటు టీడీపీ శ్రేణులతోపాటు ఇటు అధికార వైసీపీలోనూ.. మరోవైపు దేశవ్యాప్తంగాఈ తీర్పుపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

నేడు లేకపోతే 30 వరకు ఓపికపట్టాల్సిందేనా?

స్కిల్ స్కాం కేసులో రిమాండ్ పిటిషన్‌ను కొట్టివేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. స్కిల్ స్కాం కేసును కొట్టివేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పటికే వాదనలు వింది. ఇరువాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 20కు కేసు విచారణను వాయిదా వేసింది. నేడు ఈ కేసులో తీర్పు వెల్లడించే అవకాశం ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే ఈ స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 42 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా చంద్రబాబుకు రిలీఫ్ దొరుకుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఈనెల 21నుంచి 29 వరకు సుప్రీంకోర్టుకు దసరా సెలవులు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేడు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తీర్పును వాయిదా వేస్తే ఈనెల 30 వరకు ఓపిక పట్టాల్సిందే.

సెక్షన్ 17-ఏ చుట్టూ వాదనలు

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ నుంచి క్వాష్ పిటిషన్‌ వరకు విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ చంద్రబాబు తరఫు లాయర్లు వాదిస్తున్న ఏకైక అంశం సెక్షన్ 17-ఏ. ఈ స్కిల్ స్కాం కేసు జరగలేదని.. చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేసేదానికన్నా ఆయనకు సెక్షన్ 17 ఏ వర్తిస్తుందని మాత్రమే వాదిస్తున్నారు. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంలో సీఐడీ నిబంధనలు పాటించలేదని.. అవినీతి నిరోధక చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం.. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబుపై కేసు పెట్టడం చెల్లదని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. చట్టంలోకి ఈ సెక్షన్ రాకముందే అంటే 2018లో నేరం జరిగింది కనుక చంద్రబాబు అరెస్టు విషయంలో 17-ఏ వర్తించదు అని సీఐడీ వాదిస్తోంది. చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్‌లో లేదని... కానీ సీఐడీ ఏ-37గా చేర్చినట్లు చంద్రబాబు తరఫు న్యాయవాది వాదించారు. ఈ సందర్భంలో సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు వాదించారు. ఒకవేళ చంద్రబాబుకు సెక్షన్ 17-A వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు తేలిస్తే కేసు కొట్టివేతకు గురైనట్లే. అంటే ఈ కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ దొరికినట్లేననడంలో సందేహం లేదు.

అంతా ఎదురుచూపులు

ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు తీర్పుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గవర్నర్ అనుమతి తీసుకుని చంద్రబాబుపై మళ్లీ కేసు పెట్టండి అని సీఐడీని సుప్రీంకోర్టు ఆదేశించే అవకాశం లేకపోలేదు అని తెలుస్తోంది. అలాగే కేసు నుంచి పూర్తి రిలీఫ్ కావాలంటే దిగువ కోర్టుకు వెళ్లాలని చంద్రబాబుకు సూచించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడిస్తే కానీ చంద్రబాబు నాయుడు భవిష్యత్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-Aకి సంబంధించిన ఈ తీర్పు న్యాయవ్యవస్థలో ఒక బెంచ్‌మార్క్ కాబోతోంది అనడంలో ఎలాంలి సందేహం లేదు. ఈ తీర్పుకోసం చంద్రబాబు నాయుడుతో పాటు దేశంలోని మిగిలిన పొలిటీషియన్స్ సైతం ఈ తీర్పుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More..

చంద్రబాబుకు ఊరట: నవంబర్ 9 వరకు అరెస్ట్ చేయోద్దన్న సుప్రీంకోర్టు

Advertisement

Next Story

Most Viewed