వైసీపీలో ప్రశ్నిస్తే తొక్కేయడం, నలిపేయడమే: ఆనం రామనారాయణరెడ్డి ఫైర్

by Satheesh |
వైసీపీలో ప్రశ్నిస్తే తొక్కేయడం, నలిపేయడమే: ఆనం రామనారాయణరెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.. ప్రభుత్వంలో ఏకఛత్రాధిపత్యం రాజ్యమేలుతోంది. రాజులు కాలం నాటి తరహా పాలన కొనసాగుతుంది. కేవలం భజన పరులనే అందలమెక్కిస్తోంది అధి నాయకత్వం. ప్రభుత్వం, పార్టీలో జరుగుతున్న అరాచకాలపై ప్రశ్నించడం మెుదలు పెట్టినప్పటి నుంచి నాపై కుట్రలు చేశారు. ప్రశ్నించే తనను తొక్కేయాలని, నలిపివేయాలని చూశారు.

అయినప్పటికీ ప్రశ్నించడంతో తట్టుకోలేక నా నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ఇన్‌చార్జిగా నియమించారు’ అని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. క్రాస్‌ ఓటింగ్‌ను నిర్ధారించడం సీక్రెట్‌ బ్యాలెట్‌లో సాధ్యం కాదు అని తెలిసనప్పటికీ తాను ఏదో తప్పు చేశానని ఆరోపిస్తూ సస్పెండ్ చేయడం వారి రాజకీయ అహంకారానికి నిదర్శనం అని చెప్పుకొచ్చారు. ప్రముఖ మీడియా సంస్థతో మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వెల్లడించారు.

భజన చేస్తేనే పదవులా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఎన్నడూ చూడలేదని చెప్పుకొచ్చారు. ప్రజా స్వామ్య విలువలను దిగజార్చేలా అధికార పార్టీలోని నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపనీయమన్నారు. ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదు.

అడిగితే వేటు.. భజన చేస్తే పదవులు అంటే ఎలా అని ప్రశ్నించారు. భజన చేయకపోతే వారిని ఇబ్బందులకు గురి చేస్తు్న్నారని ఇలాంటి పరిస్థితులు రావడం రాజకీయాల్లో దురదృష్టకరమన్నారు. రాజకీయంగా ఎంతోమంది ముఖ్యమంత్రుల వద్ద పనిచేశానని కానీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి నియోజకవర్గం సమస్యలపై ప్రశ్ని్స్తూ వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఈ ప్రశ్నలను సద్విమర్శగా తీసుకోవాలే తప్ప రాజకీయ కక్ష సాధింపునకు కారణంగా చూపకూడదని ఆనం రామనారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు.

ప్రశ్నించే గొంతు ఉండకూడదనే

అధికార పార్టీ ఎమ్మెల్యేను అయినప్పటికీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో తనను కొందరు టార్గెట్ చేశారని మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకను తొక్కేయడం, నలిపివేయడం వంటి చర్యలకు పార్టీ అధిష్టానం చేపట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో అలాగే నెల్లూరు జిల్లాలో జరుగుతున్న దోపిడీ వ్యవస్థలపై ప్రశ్నిస్తే తప్పుబట్టారు. అభివృద్ధి ఆగిపోయింది.. అరాచక శక్తులు రాజ్యమేలుతున్నారు.

ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాను. ప్రశ్నించే గొంతుక ఉండకూడదని భావించి నన్ను పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాదు నా నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. దురదృష్టం ఏంటంటే నియోజకవర్గం అభివృద్ధి విషయంలో కానీ ఇతర అంశాల్లో కానీ సహకరించవద్దని జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు సీఎంవో నుంచి ఫోన్లు రావడం అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి భద్రత కూడా తగ్గించారు అని మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు.

మేం చిల్లర వ్యవహారాలకు పాల్పడే వ్యక్తులం కాదు

ఎమ్మెల్యేలగా పాలనాపరమైన అంశాల్లో పక్కన పెట్టింది సరిపోదనుకున్నారో ఏమో ఏకంగా పార్టీ నుంచి కూడా సాగనంపే ప్రయత్నం చేశారు అని మాజీమంత్రి ఆనం రామనారాయరెడ్డి ఆరోపించారు. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను అడ్డుపెట్టుకుని సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తులతో నాలుగేళ్లు నడిచినందుకు బాధపడుతున్నాం అంటూ ఆనం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌ను నిర్ధారించడం సీక్రేట్ బ్యాలెట్‌లో సాధ్యం కాదు.

అంత పటిష్టమైన చట్టం ఉంది. అయితే పార్టీని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు నన్ను బయటకు పంపాలనే కుట్రలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డానని నిందలు వేసి సస్పెండ్ చేశారు. అక్కడితో ఆగిపోలేదు మేం అమ్ముడుపోయాం అటూ ఆరోపణలు సైతం చేశారు. రాజకీయాల్లో ఇలాంటి నిందలు, ఆరోపణలు సహజం. మాపై చేసిన ఆరోపణలను ప్రజలు విశ్వసించరు. ఇలాంటి చిల్లర వ్యవహారాలకు తాము పాల్పడ్డామని భావిస్తే అది వాళ్ల ఖర్మేనంటూ మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

సలహాదారు వేలకోట్లు సంపాదించారు?

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రూ.15 నుంచి 20 కోట్లకు టీడీపీకి అమ్ముడుపోయామంటూ చేస్తు్న్న ఆయన నాలుగేళ్లలో వేల కోట్లు ఎలా సంపాదించారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సలహాదారులానే అందరూ ఉంటానుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎవరేమనుకుంటే మాకేంటి.. మేం అనుకున్నదే చేస్తాం.. అదిజరిగి తీరాల్సిందే అన్నట్లు ప్రభుత్వ సలహాదారు వ్యవహరిస్తు్న్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అలాంటి సలహాదారుల సలహాలతో నడిచే ప్రభుత్వం భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. మరోవైపు ఇప్పటి వరకు తాను పని చేసిన ముఖ్యమంత్రులు అంతా ప్రజాస్వామ్య విలువలును పాటించే వారు. అంతేకాదు పార్టీలోని వ్యక్తులను గౌరవించేవాళ్లు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు అని చెప్పుకొచ్చారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అలాగే తన కుమార్తె పోటీ చేసే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed