ఏపీలో మరో పాలసీ ఆవిష్కరణ.. పెట్టుబడిదారులకు బంపర్ ఆఫర్

by srinivas |
ఏపీలో మరో పాలసీ ఆవిష్కరణ.. పెట్టుబడిదారులకు బంపర్ ఆఫర్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నూతన పర్యాటక పాలసీ 2024-2029ను మంత్రి కందుల దుర్గేష్(Minister Kandua Durgesh) ఆవిష్కరించారు. సీఐఐ, ఏపీ చాంబర్స్ ఆధ్వర్యంలో విజయవాడ హోటల్ వివంత‌లో జరిగిన పర్యాటక పెట్టుబడిదారుల(Tourism investors) సమావేశంలో ఆయన ఈ కొత్త పాలసీని విడుదల చేశారు. పెట్టుబడిదారులను ఆహ్వానించారు. వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. నూతన పాలసీ ద్వారా పెట్టుబడిదారులకు ప్రభుత్వపరంగా ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలను వివరించారు. ప్రభుత్వ నుంచి ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని, ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని హామీ ఇచ్చారు. పర్యాటక రంగంలో తమది సమగ్ర విధానం అని మంత్రి దుర్గేశ్ తెలిపారు. పర్యాటక రంగంలో రూ. 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలన్నది ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్రంలో విశాలమైన సముద్రతీరం, అద్భుతమైన చారిత్రక, వారసత్వ, ప్రకృతి సంపద, సజీవ నదులు ఉన్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) దిశానిర్దేశంలో రాష్ట్ర పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతుల కల్పనతో ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని మంత్రి దుర్గేశ్ వెల్లడించారు.

పర్యాటక రంగంలో ఏపీని దేశంలో అగ్రగామిగా నిలబెట్టాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి దుర్గేశ్ చెప్పారు. పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబు పరిశ్రమ హోదా కల్పించడం శుభపరిణామమన్నారు. పర్యాటక ప్రాంతంలో పర్యాటకుడు ఐదు రోజులు ఉండే విధంగా మౌలిక వసతులు, టూరిజం సర్క్యూట్‌ల ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో హోటళ్లలో గదుల సంఖ్యను 50,000కు పెంచేయోచన చేస్తుమన్నారు. పీపీపీ విధానంలో రూ.25000 కోట్ల పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఒకే తరహా పర్యాటక అభివృద్ధి కాకుండా టెంపుల్, అడ్వెంచర్, ఎకో, విలేజ్, వెల్ నెస్ , అగ్రి టూరిజం తరహా పర్యాటక విధానాలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పర్యాటకంలో సరైన నిర్వహణ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 3 ఎకో టూరిజం, 10 టెంపుల్, 2 బుద్దిస్ట్, 5 బీచ్, 4 రివర్, 2 క్రూయిజ్ సర్క్యూట్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో కుదేలైన పర్యాటక రంగాన్ని సరిదిద్దుతున్నామని దీమా వ్యక్తం చేశారు. పరిశ్రమలకు ఇచ్చే అన్ని రాయితీలు పర్యాటక రంగంలో అమలు చేస్తూ అభివృద్ధి చేయాలని భావిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సాస్కి పథకం ద్వారా అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసిందన్నారు. పర్యాటక రంగంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. పర్యాటక ప్రాజెక్టుల్లో భద్రతా చర్యలు, ప్రమాణాలు దృష్టిలో పెట్టుకొని వృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story