AP News:చారిత్రక కట్టడాల పరిరక్షణకు చర్యలు.. మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News:చారిత్రక కట్టడాల పరిరక్షణకు చర్యలు.. మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి,కడప: చారిత్రక కట్టడాలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరువ శ్రీధర్, పర్యాటక అధికారులతో కలిసి ఆయన సిద్ధవటం కోటను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చారిత్రక వారసత్వ కట్టడాలు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రెండో శతాబ్దం నాటి మట్లి రాజులు నిర్మించిన అద్భుతమైన సిద్ధవటం కోటలోని శివాలయం మసీదు, పరిశీలించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారాలతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం పి పి పి మోడల్ లో ఇన్వెస్టర్ల తో ఇటీవలే సమావేశం కూడా నిర్వహించడం జరిగిందన్నారు.

సిద్ధవటం కోట చుట్టూ ఉన్న దేవాలయాలను పరిరక్షించి వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ఈ ప్రాంతంలో సఫారీ, బోటింగ్, రెస్టారెంట్, సర్క్యూట్ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. సిద్ధవటం కోట లోని శిథిలావస్థకు చేరుకున్న వాటికి మరమ్మతులు చేపడతామని తెలిపారు. అలాగే ఇక్కడికి వచ్చే పర్యాటకులు బస చేసి ఇక్కడి ప్రాంతాలను సందర్శించుకునే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి లభిస్తుందని అన్నారు. జిల్లాలోని గండి కోటకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహకారం అందించిందని అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా సహకారాన్ని తీసుకొని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, వెల్నెస్ టూరిజం లను అభివృద్ధి చేస్తామని తెలిపారు.రాష్ట్రంలో అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వాటిని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ముందుగా సిద్ధవటం కోటలో కాలినడకన పలు ప్రదేశాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed