వరదసహాయంపై వైసీపీ దుష్ప్రచారం చేయడం దారుణం: మంత్రి అనగాని ఫైర్

by karthikeya |   ( Updated:2024-10-09 08:57:00.0  )
వరదసహాయంపై వైసీపీ దుష్ప్రచారం చేయడం దారుణం: మంత్రి అనగాని ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: వరద సహాయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని, వాళ్ల దుష్ట పత్రికలు, చానెళ్ల ద్వారా తప్పుడు వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్తోందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలో ఈ రోజు (బుధవారం) టీడీపీ మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే అనగాని వైసీపీపై విరుచుకుపడ్డారు. విజయవాడ వరదల్లో సీఎం చంద్రబాబునాయుడు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డారని, మంత్రులు అధికారులందరూ వరద బాధితుల కోసం పనిచేశారని, 32 మంది ఐఏఎస్‌ ఆఫీసర్లు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తోకలిసి పగలు-రాత్రి తేడా లేకుండా కష్టపడ్డారని, వారి శ్రమని తక్కువ చేసి మాట్లాడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశంసించడం మానేసి వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇది తమ నేత, సీఎం చంద్రబాబునాయుడుపై బురద చల్లడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదని అన్నారు.

కృష్ణానదికి ఎప్పుడూ లేనంత వరద వచ్చిందని, అయినా తమ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా నెలరోజుల్లోనే వదరబాధితులందరికీ నష్టపరిహారం అదించిందని చెప్పారు. తమ ప్రభుత్వం అన్నిరకాలుగా వరదబాధితులకు సహాయం చేస్తోందని అన్నారు. ఎంఎస్‌ఎంఈల యజమానులకు సైతం బ్యాంకు అధికారులతో మాట్లాడి సహాయం చేస్తున్నామని తెలిపారు. వరదల వల్ల ఎవరింట్లో అయినా ఫ్రిజ్‌లు, టీవీలు, బైక్‌లు, కార్లు ఏం చెడిపోయినా వారందరికీ నష్టపరిహారం ఇచ్చామని, చివరికి వరదల్లో తోపుడు బళ్లు కోల్పోయిన యజమానులకు కూడా టీడీపీ ప్రత్యామ్నాయ తోపుడు బళ్లను అందించిందని చెప్పారు.

చివరిగా.. వరద బాధితుల కోసం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్లు చెబుతున్న కోటి రూపాయల విరాళం కూడా ఇవ్వలేదనే అనుమానం ఉందని, ఆయన ఆ మొత్తాన్ని ఎవరికిచ్చారోనని, తమ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మాత్రం వచ్చినట్లు లెక్కల్లో కనిపించడం లేదని అనగాని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి అనిత, మంత్రి పొంగూరు నారాయణ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story