గవర్నర్ దంపతులతో, సీఎం జగన్ దంపతులు మర్యాదపూర్వక భేటీ..

by Hamsa |
గవర్నర్ దంపతులతో, సీఎం జగన్ దంపతులు మర్యాదపూర్వక భేటీ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సోమవారం ఉదయం విజయవాడలోని రాజ్ భవన్‌లో గవర్నర్ దంపతులను కలిశారు. ఛత్తీస్‌ఘడ్‌ గవర్నర్‌గా బిశ్వభూషన్‌ హరిచందన్‌ బదిలీ అయిన నేపథ్యంలో అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర గవర్నర్‌గా మూడేళ్లపాటు సేవలందించినందుకుగానూ బిశ్వభూషణ్ హరిచందన్‌కు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్‌గా బీబీ హరిచందన్ అందించిన సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఆయన్ని గుర్తుంచుకుంటారని.. మచ్చలేని వ్యక్తిత్వం హరిచందన్‌ సొంతమని సీఎం జగన్ అభివర్ణించారు.

కొవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితులను దాటుకుని రాష్ట్రం ప్రగతి పథంలో పయనించడానికి మరువలేని సహకారాన్ని అందించారని ప్రశంసించారు. అధికార కార్యకలాపాల నిర్వహణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పరడవిల్లేలా, నిండైన హుందాతనంతో వ్యవహరించారని, అత్యుత్తమ రాజకీయ పరిణితి చూపించారని అన్నారు. రాష్ట్ర- కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంలో, వాటి సంబంధాలు సజావుగాసాగడంలో అత్యంత కీలక పాత్రపోషించి, రాజ్యాంగానికి వన్నెతెచ్చారని కొనియాడారు. తండ్రివాత్సల్యాన్ని చూపారని, ఆత్మీయతను తెలుగు ప్రజలకు పంచారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రం నుంచి బీబీ హరిచందన్ వెళ్లిపోవడం, కాస్త బాధాకరమైనప్పటికీ వేరే రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లడం అక్కడి ప్రజలకు కూడా ఆయన మేలు చేస్తారని సీఎం జగన్ ఆకాంక్షించారు.

Next Story