ప్రజలందరినీ కదిలించేలా..: ఉమ్మడి మేనిఫెస్టోపై టీడీపీ-జనసేన కసరత్తు

by Seetharam |   ( Updated:2023-11-13 09:49:13.0  )
ప్రజలందరినీ కదిలించేలా..: ఉమ్మడి మేనిఫెస్టోపై టీడీపీ-జనసేన కసరత్తు
X

దిశ, డైనమిక్ బ్యూరో : వచ్చే ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీని గద్దె దించాలనే కసితో టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే ఇరు పార్టీలు పొత్తుతో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పార్టీల మధ్య సమన్వయం కోసం వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇరు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టో కమిటీకి సంబంధించి సభ్యుల నియామం కూడా జరిగిపోయింది. ఇలా ఈ రెండు పార్టీల నుంచి ఏర్పాటైన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది. రెండు పార్టీల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఈ కమిటీ చర్చించనుంది. ఏపీ‌లో ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్ళేందుకు తెలుగుదేశం-జనసేన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ రాజమహేంద్రవరం వేదికగా సూపర్ సిక్స్ హామీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మహిళల కోసం మహా శక్తి, రైతుల కోసం అన్నదాత, యువత కోసం యువ గళం, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇంటింటికీ మంచినీరు హామీలు ఇచ్చింది.తాజాగా జనసేన కూడా షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఆరు ప్రతిపాదనలు తీసుకువచ్చింది. రైతులు, యువత, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడం, ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగం వంటి అంశాలను ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే.

కమిటీలు ఇవే

ఇకపోతే ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన కోసం అటు జనసేన ఇటు టీడీపీల నుంచి ముగ్గురేసి నాయకుల చొప్పున కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నుంచి సభ్యులుగా పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఈ ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన కమిటీలో ఉండగా....జనసేన పార్టీ నుంచి జనవాణి సమన్వయకర్త వర ప్రసాద్, రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సభ్యుడు ముత్తా శశిధర్, జనసేన అధికార ప్రతినిధి శరత్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరినీ కదిలించేలా మేనిఫెస్టోను రూపొందించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించాయి. మహిళలు, రైతులు, యువత, బీసీ, పేదలే టార్గెట్‌గా ఇరు పార్టీలు పలు ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ప్రజలకు టీడీపీ, జనసేన కూటమిపై మరింత నమ్మకం పెరిగేలా చేయాలని భావిస్తున్నాయి. అందుకోసమే కమిటీని ఏర్పాటు చేసి ఏయే అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలన్నదానిపై కూలంకశంగా చర్చించేందుకు సిద్దమయ్యాయి. త్వరలోనే ఈ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించి ఇరుపార్టీల నాయకులంతా ప్రజల్లోనే ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.

ఆత్మీయ సమావేశాలు

ఇదిలా ఉంటే ఈనెల 13 నుంచి ఈ నెల 16 వరకూ మొత్తం 175 నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు జరపాలని నిర్ణయించాయి. అనంతరం ఈ నెల 18 నుంచి ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేయడానికి వ్యూహరచన చేస్తున్నాయి. ఉమ్మడి కోఆర్డినేసన్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 18,19 తేదీల్లో ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. వీలైనంత త్వరగా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తూనే మేనిఫెస్టోపై ప్రచారం చేయాలని ఇరు పార్టీలు ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed