Atchannaidu: కౌలు రైతులకు కూడా రుణాలు.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-08-03 11:33:19.0  )
Atchannaidu: కౌలు రైతులకు కూడా రుణాలు.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నా హయాంలో ప్రతీ కౌలు రైతుకు న్యాయం జరగాలని, సాగు చేసే రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడలో ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చె్న్నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ సేవలను విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టాలని, ఆప్కాబ్- డీసీసీబీ, సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు అధిక శాతం రుణాలను అందించాలని అన్నారు.

అలాగే సహకార వ్యవస్థలో ఈ కేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఇక నా హయాంలో నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు రావాలని, కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి వారికి కూడా రుణాలు ఇవ్వాలని చెప్పారు. అలాగే పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న రైతులకు రుణాలు ఇవ్వాలని సూచించారు. రేపటి నుంచే పరిస్థితి మారాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చి దిద్దాలని, వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలని సూచనలు చేశారు. ఇక డిజిటైలేజేషన్ తోనే అక్రమాలకు చెక్ పెట్టవచ్చని చెబుతూ.. సహకార సంఘాల్లో అవినీతి జరిగిందని వస్తున్న వార్తలపై విచారణ జరపించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed