AP News:యువ కెరటాలు -2025 విజయవంతం చేద్దాం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News:యువ కెరటాలు -2025 విజయవంతం చేద్దాం.. మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: యువతలోని నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా యువకెరటాలు - 2025 నిర్వహించనున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, కాలేజీ యాజమాన్యాలు, పార్టీ నాయకులతో యువ కెరటాలు -2025 కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు. వివేకానందుడి జయంతి సందర్భంగా గతంలో(2014-2019) యువ దినోత్సవాలు నిర్వహించామని గుర్తు చేశారు. యువత జీవితాలను మార్గదర్శనం చేసేలా యండమూరి వీరేంద్రనాథ్ లాంటి వక్తలను పిలిపించి యువతను ఉత్తేజపరిచినట్లు చెప్పారు. కానీ.. ప్రభుత్వం మారిన తర్వాత అలాంటి కార్యక్రమాలు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

ఎన్నో కళలకు, నైపుణ్యాలకు మచిలీపట్నం నెలవు. అలాంటి ప్రాంతం కొంత కాలంగా నిరాదరణకు గురవ్వడం బాధాకరం. ఇక్కడ చదువుకున్న పిల్లలు దేశ విదేశాల్లో మెరుగైన స్థానాల్లో ఉన్నారు. ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితిని మార్చాలనే లక్ష్యంతోనే యువ దినోత్సవాలు, యువ కెరటాలు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఇక్కడి యువతకు ఇక్కడే ఉద్యోగాలివ్వాలి, ఉద్యోగాలిచ్చే స్థాయికి యువత ఎదగాలి. వారిలో ఉన్న మన మచిలీపట్నం నుంచి ఎదిగిన గ్రీన్ కో అధినేత ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా రాబోతున్నారు. మన ఆలోచనే మన పెట్టుబడి అనే విషయాన్ని గ్రీన్ కో అధినేత ప్రపంచానికి చాటి చెప్పారు.

మన యువతలో చాలా విషయ నాలెడ్జి ఉంది. కానీ వారికి సరైన గైడెన్స్ లేకపోవడం కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారికి అవసరమైన స్కిల్ సపోర్ట్ అందించేలా యువ కెరటాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఒకప్పుడు మన జ్యువెలరీ పార్క్ లో కొత్త డిజైన్ కావాలంటే కలకత్తా లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు అన్నీ ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాం. త్వరలోనే బందరు పోర్టు పూర్తి కాబోతోంది. అందుకు కావాల్సిన స్థాయిలో మన యువతకు నైపుణ్యాభివృద్ధి చేస్తే వారిని మించిన శక్తి మరెవరూ ఉండరు. గ్రీన్ ఎనర్జీ పై అవగాహన పెంచుకోవాలి. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూ సేకరణ చేస్తున్నాం.

మన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిద్దే లక్ష్యంతో రాష్ట్రంలోనే తొలిసారిగా మచిలీపట్నంలో MSME - UDYAM సదస్సు నిర్వహించాం. వందలాది మంది ఆసక్తి చూపారు. 200 మంది వరకు పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నారు. అదే సమయంలో క్రీడారంగం, పర్యాటకం, ఇతర రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకుందాం. ఏర్పాట్ల విషయంలో అధికారులు, పార్టీ నాయకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ప్రత్యేకంగా పోలీసింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అందరూ విద్యార్థులు, యువత వచ్చే నేపథ్యంలో స్నేహపూర్వక వాతావరణంలో పోలీసింగ్ నిర్వహించాలి. వాలంటీర్ల ఏర్పాటు, భోజనం, మంచినీరు, రవాణా సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. యువ కెరటాలు -2025 నిర్వహణతో బందరు చరిత్రను తిరగ రాద్దామని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు

Advertisement

Next Story

Most Viewed