Tiger: ఆత్మకూరు మండలంలో పెద్దపులి కలకలం.. రోడ్డుపై సంచారం

by srinivas |
Tiger: ఆత్మకూరు మండలంలో పెద్దపులి కలకలం.. రోడ్డుపై సంచారం
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేగింది. కరివేన - నల్లకాలువ గ్రామాల మధ్య రోడ్డుపై నడుస్తూ స్థానికుల కంట పడింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడు ఏం చేస్తుందోనని జంకిపోతున్నారు. కంటిమీద కునుకు లేకుండా భయపడిపోతున్నారు. పెద్ద పులి సంచారంపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పులి కనిపించిన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. పులి పాద ముద్రలు ద్వారా కదలికలు గమనిస్తున్నారు. స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులి వచ్చినట్లు భావిస్తున్నారు. పులిని బంధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. పులిని పట్టుకునే వరకు స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాత్రివేళ కరివేన - నల్లకాలువ గ్రామాల మధ్య రోడ్డుపైకి రావొద్దని సూచించారు. రైతులు, పశువుల కాపర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు. పెద్దపులి మళ్లీ కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Next Story