- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శ్రీశైలం నీటి ముంపు నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు
దిశ ప్రతినిధి, కర్నూలు : ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరడం తో శ్రీశైలం నీటి ముంపు నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం 98 జీఓపై దృష్టి కేంద్రీకరించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు నీటిపారుదల శాఖలో ఉన్నతాధికారులు ఖాళీలు గుర్తించాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలివ్వడమే. చాలా మంది ఉద్యోగ విరమణ చేయగా మరికొందరు రెగ్యూలర్ పోస్టులకు అర్హత సాధించడంతో నీటిపారుదల శాఖకు సంబంధించిన పలు విభాగాల్లో పోస్టులు ఖాళీ అయ్యాయి. వాటిని భర్తీ చేసేందుకు ఆ శాఖ కసరత్తు చేస్తోంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన విధంగా పైరవీలకు తావు లేకుండా అర్హులకు ఉద్యోగాలివ్వాలని నీటి ముంపు నిరుద్యోగులు కోరుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బహుళార్ధ సాధక ప్రాజెక్టు అయిన శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం అటు తెలంగాణతో పాటు ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన దాదాపు 3 వేల మందికి పైగా రైతులు 10 వేల ఎకరాలు త్యాగం చేసి నిర్వాసితులయ్యారు.
అందులో 5 మండలాలైన నందికొట్కూరు, పాములపాడు, జూపాడుబంగ్లా, పగిడ్యాల, కొత్తపల్లి మండలాల్లోని దాదాపు 44 గ్రామాలకు చెందిన 2 వేల మందికి పైగా నిర్వాసితులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1982 నుంచి ఉద్యోగాల కోసం నిర్వాసితులు విడతల వారీగా నిరసనలు చేపట్టారు. ఎట్టకేలకు దిగొచ్చిన అప్పటి ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎలాంటి భద్రత లేకుండా 962 మందిని లష్కర్లు గా నియమించింది. అప్పట్లో రూ.8 వేలతో ప్రారంభమైన వారి వేతనం ప్రస్తుతం రూ.20 వేలకు పెంచింది. వీరు కాకుండా జిల్లాలో ఉద్యోగాల కోసం రెండో విడతగా 930 మంది నిర్వాసితులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 674 మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. ఇంకా దరఖాస్తుకు నోచుకోని వారు మరో 300లకు పైగా ఉన్నారు. 2011-12 మధ్య కాలంలో 962 మందిని ప్రభుత్వం సర్కిల్-1, సర్కిల్-2, మైక్రో ఇరిగేషన్, హంద్రీనీవా సుజలా స్రవంతి తదితర విభాగాల్లో మొదట లష్కర్లుగా తీసుకున్నారు. అందులో చాలా మంది ఉద్యోగ విరమణ పొందగా, మరి కొందరు ఉన్నత విద్యార్హత, సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండటంతో వారిని రెగ్యూలర్ జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు, టైపిస్టులుగా అవకాశం కల్పించారు. దీంతో వీరి స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.
300 పోస్టులకు పైగా ఖాళీలు ?
సర్కిల్-1 పరిధిలో నంద్యాల, ఓర్వకల్, పాణ్యం, గోరుకల్, సర్కిల్-2 పరిధిలో బనగానపల్లె, అవుకు, కోయిలకుంట్ల ప్రాంతాలున్నాయి. ఇవన్నీ ఎస్ఆర్బీసీ పరిధిలోకి వస్తాయి. అలాగే హంద్రీనీవా సుజలా స్రవంతి, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో దాదాపు 300లకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అధికారులు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు లెక్కించాలని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కింది స్థాయి అధికారులు సర్కిల్-1 పరిధిలో 80, సర్కిల్-2 పరిధిలో 70 ఇలా మిగతా విభాగాల్లో కలిపి 300లకు పైగా పోస్టులున్నట్లు సమాచారం.
పైరవీలకు తావులేకుండా చేసేరా ?
నీటిపారుదల శాఖలో అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు పైరవీలు చేసి అర్హులను వదిలేసి ముడుపులిచ్చిన అనర్హులకు ఉద్యోగాలు వచ్చేలా చేశారు. ఫలితంగా నీటి ముంపులో సర్వం కోల్పోయిన చాలా మంది నిరుద్యోగులు మాత్రం నేటికీ తీవ్ర అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. అందులో ఇద్దరు 98 జీవో లో ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ అనేక ఉద్యమాలు చేసి, అమరణ నిరాహార దీక్ష చేశారు. అలాంటి వారికి అధికారులు రకరకాల కారణాల సాకు చూపి నేటికీ ఉద్యోగాలివ్వలేదు. చేసేది లేక వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉండటంతో తమకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు.
అర్హులకు ఉద్యోగాలివ్వాలి
శ్రీశైలం ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన నీటి ముంపు బాధితుల్లో అర్హులైన నిరుద్యోగులకు ప్రభుత్వం లష్కర్ ఉద్యోగాలిచ్చి న్యాయం చేయాలి. ప్రస్తుతం నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల్లో దాదాపు 300లకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలని ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అలా చేశానన్న అక్కసుతో అధికారులు మొదటి జాబితాలో నాకు ఉద్యోగం ఇవ్వలేదు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తే రెండో జాబితాలో పేరు నమోదు చేశారు. ఎన్నికల ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు నీటి ముంపు నిర్వాసితులకు న్యాయం చేస్తానని హామీనిచ్చారు. ఆయనపై మాకు నమ్మకం ఉంది. చాలా మంది అనర్హులు అడ్డదారిలో ఉద్యోగాలు సంపాదించారు. అలాంటి వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి.:- బొల్లు ప్రసాద్, నీటిముంపు నిరుద్యోగి, పెద్ద గుమ్మడాపురం గ్రామం