Kurnool Congress: బీజేపీ పతనం ప్రారంభమైంది?

by srinivas |   ( Updated:2023-05-13 15:56:52.0  )
Kurnool Congress: బీజేపీ పతనం ప్రారంభమైంది?
X

దిశ, కర్నూల్ అర్బన్: దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎం.సుధాకర్ బాబు జోస్యం చెప్పారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీని తలదన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధించడంతో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన కర్ణాటక ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నారు. మోదీ మత కలహాలు సృష్టించి ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేశాడని చెప్పారు. రాహుల్ గాంధీ కర్ణాటక ప్రజల ప్రేమ ముందు మోదీ కుయుక్తులు పని చేయలేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అధికార మదంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించారని మండిపడ్డారు. మోదీ చేసే తప్పులు ఎవరికీ తెలియవని అనుకుంటున్నాడని, దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. తెలంగాణ, భూపాల్, రాజస్థాన్‌లలో జరగబోయే ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని తెలియజేశారు.

ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నాగమధు యాదవ్ మాట్లాడుతూ కర్ణాటక ప్రజలు దేశంలో మార్పును కోరుకుంటున్నారన్నారు. అందుకే కర్ణాటక ప్రజలు బిజెపికి బుద్ధి చెప్పారని చెప్పారు.

కర్నూలు కాంగ్రెస్ అధ్యక్షుడు జాన్ విల్సన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర ద్వారా ప్రజలలో చైతన్యం వచ్చిందని చెప్పారు. కర్ణాటక ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు.

డీసీసీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుపొంది రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు బి బతుకన్న మాట్లాడుతూ దేశ ప్రజలు రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలని ఆశిస్తున్నారని చెప్పారు. అది త్వరలో నెరవేరుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed