Kurnool Collector: ఉద్యోగాల పేరుతో మోసం చేస్తే చర్యలు

by srinivas |
Kurnool Collector: ఉద్యోగాల పేరుతో మోసం చేస్తే చర్యలు
X

దిశ, కర్నూలు ప్రతినిధి:ఉద్యోగాల పేరుతో మోసం చేస్తే చర్యలు తప్పవని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన హెచ్చరించారు.ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడే వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరికీ కూడా డబ్బులివ్వొద్దన్నారు. ప్రభుత్వంలో ఏ రిక్రూట్ మెంట్ అయినా నోటిఫికేషన్ ద్వారా పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేయనున్నట్లు చెప్పారు. రెగ్యులర్ ఉద్యోగాలైనా, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు ఇలా ఏవైనా ప్రజలకు తెలియజేసిన తర్వాతే నియామకాలు చేపడతారని చెప్పారు. కలెక్టర్ పేరు గానీ, ఇతర ఉన్నతాధికారుల పేరు చెప్పి గానీ డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వారిని నమ్మొద్దన్నారు. ఈ విధంగా ఎవరైనా చెబితే తమ దృష్టికి తీసుకురావాలని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.

కాగా కలెక్టర్ పేరు చెప్పి ఖజానా శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తామని, మోసం చేస్తున్న కర్నూలు నగరానికి చెందిన బి.క్యాంపు నివాసి వైడూర్య అనే మహిళపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబ్బు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి రావడంతో ఆమెపై కేసు నమోదు చేయాల్సిందిగా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ట్రెజరీ, అకౌంట్స్ అధికారి రామచంద్ర రావు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో వైడూర్య అనే మహిళపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed