వైఎస్ వివేకా హత్యకేసులో కీలక మలుపు..

by Hamsa |
వైఎస్ వివేకా హత్యకేసులో కీలక మలుపు..
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఒక హత్యకేసు విచారణకు నాలుగేళ్ళు. విచారణలో రోజుకో కీలక మలుపు. అంతులేని ట్విస్టులు. కుమార్తె వర్సెస్ వరుసకు సోదరుడు. వరుసకు బాబాయ్. ఇలా కేసు విచారణలో అనేక మలుపులు తిరుగుతుంది. ఇటీవలే రెండో వివాహం తెరపైకి వచ్చింది. ఆ కోణంలో విచారిస్తుండగానే మరో అంశం తెరపైకి వచ్చింది. ఇంతలో అల్లుడును సీబీఐ విచారించడం సంచలనం రేకెత్తించింది. ఇంతకీ ఆ హత్యకేసు ఏంటో తెలిసే ఉంటుంది కదూ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య. ఈ హత్యకేసులో విచారణ ఆరంభం నుంచి ఇప్పటి వరకు వరుస ట్విస్ట్‌లు నెలకొంది. ఇప్పటికే పలువురు జైల్లో ఉండటం మరికొందరు కస్టడీలో ఉండటం ఇంకొందరు సీబీఐ విచారణకు హాజరువుతున్న సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో వైఎస్ వివేకా రెండో పెళ్లి తెరపైకి వచ్చింది. వైఎస్ వివేకాతో లవ్ ట్రాక్, పెళ్లి వంటి అంశాలపై షమీమ్ సీబీఐకు వాంగ్మూలం ఇచ్చింది. ఇదే తరుణంలో వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీబీఐ విచారించడం సంచలనంగా మారింది.

వరుస ట్విస్ట్‌లు

ఈనెలాఖరులోగా వైఎస్ వివేకా హత్యకేసు విచారణ పూర్తి కావాల్సి ఉంది. ఏప్రిల్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు దర్యాప్తులో దూకుడు పెంచారు. ఇలా దూకుడు పెంచిన సీబీఐకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఛాలెంజ్‌గా కేసు విచారణను తీసుకున్న సీబీఐ ముందుకు వెళ్తోంది. ఈ కేసులో ఇప్పటికే న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతున్నా సీబీఐ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కేసు విచారణలో దూకుడు పెంచి హంతకులను పట్టుకునే పనిలో పడింది. ఇందుకు సంబంధించి అనేకమందిని విచారించింది. కేసు చివరి దశకు చేరుకున్న తరుణంలో నిందితులు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులను సైతం సీబీఐ విచారణ చేపట్టింది. వైఎస్ అవినాశ్ రెడ్డి ఆరోపించిన వైఎస్ వివేకా రెండో భార్య షమీమ్‌ను సీబీఐ విచారించింది. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు వైఎస్ సునీతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డిని సీబీఐ విచారించడం ఈ కేసులో సంచలనంగా మారింది.

షమీమ్ ఆరోపణలపైనే విచారణ

వైఎస్ వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ సునీతారెడ్డి భర్త సీబీఐ విచారణకు హాజరయ్యారు. సీబీఐ విచారణకు రావాలని ఆదేశించడంతో కోఠిలోని సీబీఐ కార్యాలయానికి సునీత భర్త రాజశేఖర్ రెడ్డి చేరుకున్నారు. మామ వివేకా కేసుకు సంబంధించి పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా వైఎస్ వివేకా రెండో భార్య షమీమ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నలు వేశారు. రాజశేఖర్ రెడ్డి సోదరుడు శివశంకర్ రెడ్డి గురించి సీబీఐ ఆరా తీసింది. వివేకా హత్య జరిగిన రోజు రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? వివేకా ఇంటి వద్ద హత్య సమయంలో దొరికిన లేఖ, స్టాంప్ పేపర్లుపై సీబీఐ ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఆర్థిక, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన అనేక అంశాలపై వాంగ్మూలం తీసుకున్నట్లు సమాచారం. అలాగే షమీమ్‌ను ఎందుకు బెదిరించాల్సి వచ్చింది.. వివేకా హత్యకు ముందు చెక్ పవర్ ఎందుకు రద్దు చేశారు..ఆర్థిక ఇబ్బందులతో వివేకా సతమతమయ్యారా అన్న ఆరోపణలపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపణలపైనా ఆరా

ఈ హత్యకేసులో వైఎస్ సునీతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డిపై కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అనేక ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వైఎస్ వివేకా హత్య తనకంటే ముందు రాజశేఖర్ రెడ్డికి తెలుసునంటూ బాంబు పేల్చారు. అంతేకాదు వైఎస్ వివేకా హత్యకు ముందు లేఖ రాశారని ఆ లేఖను రాజశేఖర్ రెడ్డి మాయం చేశారని ఆరోపించారు. అలాగే వైఎస్ వివేకా నివాసంలోని అనేక స్టాంప్ పేపర్లను సైతం రాజశేఖర్ రెడ్డి స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో రాజశేఖర్‌ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది.

భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల విచారణ

ఇకపోతే ఆదివారం కూడా సీబీఐ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను విచారిస్తోంది. విచారణలో భాగంగా సీబీఐ ఆదివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ఇద్దరినీ సీబీఐ తన కార్యాలయంలోకి తీసుకువచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి పలు అంశాలపై విచారిస్తోంది. ఈ కేసు విచారణ ఈనెలాఖరులోపు పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎదురైన ట్విస్ట్‌ల నేపథ్యంలో భవిష్యత్‌లో ఏం జరగబోతుందనేది హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed