కాకినాడ రూరల్‌లో కాపు మంత్రం.. టీడీపీ సరికొత్త ప్రయోగం

by Rajesh |
కాకినాడ రూరల్‌లో కాపు మంత్రం.. టీడీపీ సరికొత్త ప్రయోగం
X

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సరికొత్త ప్రయోగాలను తెర తీస్తుందా ? రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి విజయఢంకా మోగించేందుకు కసరత్తు చేస్తుందా ? ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో సామాజికపరంగానూ, ఆర్థికపరంగా కొత్త సమీకరణాలకు పావులు కదుపుతుందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.

ఇందులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సామాజిక పరంగా మార్పులు చేసేందుకు ఈ సారి టీడీపీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మొన్నటి దాకా ఇక్కడ బీసీలకు ఛాన్స్ ఇచ్చారు. ఇందులో భాగంగా మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంత లక్ష్మి ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం కూడా ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం రానున్న ఎన్నికల్లో కాపులకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో ఆలోచిస్తోంది.

మార్పులకు శ్రీకారం

2024 ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గంలో బీసీలకు అవకాశం ఇవ్వనున్నారనే సమాచారం ఉంది. దీంతో కాకినాడ రూరల్ సెగ్మెంట్ లో కాపులను నిలబెడితే విజయం సాధించవచ్చని ఆలోచిస్తున్నారు. దీంతో స్థానికంగా కాకినాడ జిల్లా ఉపాధ్యక్షుడు పేరాబత్తుల రాజశేఖర్ పేరు తెర మీదకు వచ్చింది. ఆది నుంచి పార్టీ పట్ల నిజాయితీగా సేవలందించిన రాజశేఖర్ కు సీటు ఇస్తే ఎలా ఉంటుందనే కోణంలో చర్చలు సాగిస్తున్నట్లు తెలిసింది.

కాకినాడ రూరల్ ఇన్ ఛార్జిగా రాజశేఖర్ ?

సామాజిక కోణంలో రామచంద్రాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో మార్పులు చేద్దామనుకుంటున్న టీడీపీ అధిష్టానం.. మరి కొద్ది రోజుల్లో కాకినాడ రూరల్ కు కొత్త పార్టీ ఇన్చార్జిని ప్రకటించే అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ పట్ల తొలి నుంచీ విధేయతగా ఉన్న రాజశేఖర్ ను పార్టీ ఇన్చార్జిగా నియమించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

కోనసీమ ప్రాంతం జీ వేమవరానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్ 1996 లో తొలిసారిగా తన గ్రామంలో ఏక గ్రీవ ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. తర్వాత 2006 లో ఐ. పోలవరం ఎంపీపీగా పని చేశారు.

విధేయతకు పట్టం కట్టాలని..

రాజశేఖర్ 2014లో జీ వేమవరం మండలానికి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. అప్పట్లో పార్టీ పట్ల అంకిత భావంతో పని చేయడంతో జిల్లా పరిషత్ చైర్మన్ గా రాజశేఖర్ పేరు పరిశీలనకు వెళ్లింది. కానీ నాడు అంతకంటే సీనియర్ అయిన నామన రాంబాబుకు పదవి ఇప్పించాల్సి వచ్చింది. అయితే రెండున్నరేళ్ల తర్వాత రాజశేఖర్ కు పదవి కట్టబెడతారనే ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో వైసీపీలో ఉన్న జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి రావడంతో జ్యోతుల నవీన్ కు పదవి ఇవ్వాల్సి వచ్చింది.

దీంతో రాజశేఖర్‌ను ఏదైనా కార్పొరేషన్‌కు పంపుతారనే ప్రచారం కూడా జరిగింది. అధిష్టానం ఈ మేరకు వాగ్దానం కూడా చేసింది. కానీ అది కూడా జరగలేదు. అయితే రాజశేఖర్ మాత్రం ఎక్కడా పార్టీని విమర్శించిన దాఖలాలు లేవు. అప్పటి నుంచీ పార్టీ పట్ల అంకితభావంతో పని చేస్తున్నారు. పదవులు పొంది పార్టీ‌కి ద్రోహం చేస్తున్న నాయకులు ఉన్న తరుణంలో రాజశేఖర్ లాంటి కార్యకర్త పార్టీకి అవసరం అనే ఆలోచనకు అధిష్టానం వచ్చినట్లు సమాచారం. అయితే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed