ఎన్నికలకు సిద్దమవుతున్న త్రికూటమి..నేడు భూమిపూజకు ఏర్పాట్లు..కారణం ఇదే

by Indraja |   ( Updated:2024-03-13 03:54:17.0  )
ఎన్నికలకు సిద్దమవుతున్న త్రికూటమి..నేడు భూమిపూజకు ఏర్పాట్లు..కారణం ఇదే
X

దిశ డైనమిక్ బ్యూరో: ఇప్పటివరకు పొత్తులపై ద్రుష్టి సారించిన టీడీపీ ఇప్పుడు పొత్తులు ఖరారు అయిన నేపథ్యంలో పార్టీ ప్రచారంపై దృష్టిసారించింది. రానున్న ఎన్నికల్లో విజయభేరిని మోగించేందుకు త్రికూటమి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తొలిసభను సమన్వయంతో విజయవంతం చేసేందుకు మూడు పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

ఈ సభలో మూడు పార్టీలు కలిసి ఎన్నికల సమరశంఖం పూరించనున్నాయి. ఇక తమ కార్యకర్తలకు పార్టీ నేతలకు ఈ సభ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలని దిశానిర్దేశం చేస్తున్నారని సమాచారం. కాగా ఈ రోజు ఉదయం 9:32 గంటలకు సభ ఏర్పాట్లకు భూమిపూజ చేయాలని మూడు పార్టీలకు చెందిన నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇక చిలకలూరిపేట లో త్రికూటమి నిర్వహించనున్న సభ ద్వారా జగన్ పతనానికి నాంది పలుకుతామని త్రిపార్టీ అధినేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సమయం తక్కువగా ఉన్న భారీ ఏర్పాట్లకు వ్యూహ రచన చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 17వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపారు.

చిలకలూరిపేటలో ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరగనున్న తెలుగుదేశం-బీజేపీ-జనసేన ఉమ్మడి సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. కాగా ఈ సభలో మూడు పార్టీల అధినేతలు సభావేదికపై ఉండనున్నారు. దీనితో త్రికూటమి ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభ నిర్వాహణపై ఇప్పటికే ఉమ్మడిగా కమిటీలు ఏర్పాటు చేశారు. అలానే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


Advertisement

Next Story