AP Politics: ఆ తర్వాతే ముఖ్యమంత్రి పదవి?

by srinivas |   ( Updated:2023-05-14 10:37:07.0  )
AP Politics: ఆ తర్వాతే ముఖ్యమంత్రి పదవి?
X

దిశ, డైనమిక్ బ్యూరో‌: ముఖ్యమంత్రి పదవి వరించడం అంటే మామూలు విషయం కాదు. రాజకీయంగా ఒడిదుడుకులు, పోరాటాలు చేస్తేగానీ అది సాధ్యం కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలన్నది ఆ పార్టీ నేతల లక్ష్యం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ పొత్తులతో గెలిస్తే ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుందో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. జాతీయ పార్టీల్లో అయితే ముఖ్యమంత్రి పదవిపై విపరీతమైన పోటీ ఉంటుంది. ఒక్కోసారి సీల్డ్ కవర్‌లో ముఖ్యమంత్రులను ఎంపిక చేసిన సంగతి లేకపోలేదు. అంతటి ప్రతిష్టాత్మకమైన ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చిచ్చు రేపుతోంది. ముఖ్యమంత్రి పదవిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సబబే అయినప్పటికీ పొత్తులతో ఎన్నికలకు వెళ్లాల్సిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠం తమదంటే తమదేనంటూ రాజకీయ పార్టీలు వాగ్వాదానికి దిగుతున్నాయి. ఈ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే అంశంపై నెలకొన్న రాజకీయ పార్టీలలోని విభేదాలను తమవైపునకు తిప్పుకునేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

బలాన్ని బట్టే సీఎం పదవి: పవన్ కల్యాణ్

ఆలులేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్లు ఏపీలోని రాజకీయాల పరిస్థితి నెలకొంది. ఇంకా పొత్తులు ఖారారు కాలేదు.. ఎలా ఎన్నికలకు వెళ్లాలి అనేదానిపై విపక్షాలు ఓ క్లారిటీకి రాలేదు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి పీఠంపై మాత్రం రగడ మొదలైంది. ఇందుకు కారణం కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తుఫాన్ రేపుతున్నాయి. అటు బీజేపీ, టీడీపీలోనే కాదు జనసేనలోనూ గుబులు రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠం అనేది ఇప్పటికిప్పుడు వచ్చేది కాదని ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి ఎవరనేదానిపై నిర్ణయం ఉంటుందని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అంతేకాదు టీడీపీని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు జనసేన సిద్ధంగా లేదని కూడా పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై జనసేనాని పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అవ్వాలనే రాజకీయాలతో రాలేదని ఒకసారి.....ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రి అయిపోవాలని తాను అనుకోవడం లేదని ఇలా అనేక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు.

అయితే మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న వేళ పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కనీసం 45 నుంచి 50 స్థానాలు గెలిచి వుంటే సీఎం పదవి గురించి అడగటానికి వీలుండేదని తన మనసులో మాట బయటపెట్టారు. 2019లో జనసేన 134 స్థానాల్లో పోటీ చేసిందని.. కానీ మాయ చేసిన వాళ్లనే నమ్మారని పవన్ చెప్పుకొచ్చారు. ఈ సారి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. నమ్మకం అనేది ఒక్క రోజులో సంపాదించలేమని.. ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానంతో ఎంఐఎం దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతోందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

2009లో పీఆర్పీకి వచ్చిన సీట్లు కూడా రాలేదని, ఎంఐఎంలా కాదు.. కనీసం విజయ్ కాంత్ పార్టీలా కూడా గౌరవించలేదే అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బలమున్న స్థానాల్లో ఎన్నికలకు వెళదామని.. మనకు వచ్చే స్థానాలను బట్టే సీఎం పదవి గురించి అడగటానికి వీలుంటుందన్నారు. పొత్తులు పెట్టుకోవడం వల్ల పార్టీ ఎదుగుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు. చంద్రబాబు నాయుడు తనను మోసం చేస్తారని అంటున్నారని.. తానేమైనా చిన్నపిల్లాడినా మోసపోవడానికి అని పవన్ ప్రశ్నించారు. తనకు వయసు పెరిగిందని, గడ్డం నెరిసిందని .. ఏం తెలియకుండానే పార్టీలు పెట్టేసి, రాజకీయాల్లోకి వచ్చేస్తానా అంటూ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలు చేసుకుంటే రోజుకు రెండు కోట్లు సంపాదిస్తానని కానీ అన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని పవన్ తెలిపారు.

సీఎం పీఠంపైనే టీడీపీ కన్ను

తెలుగుదేశం పార్టీ సైతం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా స్పందిస్తోంది. పొత్తులో ఎన్నికలకు వెళ్లాలనుకోవడం మంచి నిర్ణయమని, అయితే ముఖ్యమంత్రి పీఠం మాత్రం టీడీపీకే ఉండాలని ఆ పార్టీలోని పలువురు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ చంద్రబాబు, యువగళం పేరుతో లోకేశ్ పాదయాత్రలు చేస్తున్నారని.. టీడీపీకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు సైతం ఉందని టీడీపీ చెప్తోంది. అంతేకాదు ఇటీవల కాలంలో టీడీపీకి ఓట్ల ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిందని.. ప్రజల్లో ఆదరణ సైతం పెరుగుతుందని టీడీపీ చెప్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చంద్రబాబునే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని పలువురు కోరుతున్నారు.

ఎన్నికల తర్వాతే సీఎంపై నిర్ణయం: జీవీఎల్

మరోవైపు ఈ ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్నామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు వెల్లడించారు. మరో పార్టీని(టీడీపీని) కలుపుకోవాలనే ప్రతిపాదనను పవన్ తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్చకూడదనే అభిప్రాయాన్ని పవన్ కల్యాణ్ చెప్పారని అన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పవన్ కల్యాణ్ కూడా బీజేపీ అధిష్టానంతో మాట్లాడుతున్నారని చెప్పారు. పొత్తులపై అంతిమ నిర్ణయం కేంద్ర నాయకత్వానిదేనని చెప్పారు. జనసేన, బీజేపీ ఎన్నికల్లో కలిసి వెళతామని మాత్రం తాము స్పష్టం చేయగలమని చెప్పుకొచ్చారు. మరోవైపు సీఎం పదవి అనేది ఎన్నికల ఫలితాల తర్వాతే నిర్ణయం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో కలిసి వెళ్లి వైసీపీని ఓడించడమే లక్ష్యమని ఆ తర్వాతే ముఖ్యమంత్రి పదవిపై ఎవరిని కూర్చోబెట్టాలి అనేది తేలుతుందని ఎంపీ జీవీఎల్ వెల్లడించారు.

చీలిక తెచ్చే పనిలో వైసీపీ

వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా సింహంలా పోటీ చేస్తామని వైసీపీ చెప్తోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు బలంగా ఉంటున్న తరుణంలో చీలిక తీసుకువచ్చేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది. ఇదే తరుణంలో టీడీపీ, బీజేపీ, వైసీపీ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ పార్టీల మధ్య ముఖ్యమంత్రి పీఠంపై పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి చీలిక తీసుకురావాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా వైసీపీ ట్రోల్ చేస్తోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే దమ్ము పవన్ కల్యాణ్‌కు లేదని తేలిపోయిందని జనసైనికులు ఇక వైసీపీకి ఓటేయ్యండని కూడా పిలుపునిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే బలం తమకు లేదని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేలా ఉన్నాయని అర్థమవుతుందని వైసీపీ చెప్తోంది. ఇలా రెచ్చగొట్టి జనసైనికులను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది.

Also Read..

జగన్ సర్కార్‌కు థాంక్స్ చెప్పిన సీబీఐ మాజీ జేడీ

Advertisement

Next Story