- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Janasena: జనంలోకి వారాహి.. త్వరలో యాత్రకు సిద్ధమైన పవన్
- వారాహియాత్రకు జనసేనాని సన్నద్ధం
- గోదావరి జిల్లాల నుంచే యాత్ర ఆరంభం
- ఉభయగోదావరి జిల్లాల అధ్యక్షులతో నాదెండ్ల మనోహర్ భేటీ
- రూట్ మ్యాప్, ఇతర అంశాలపై వాడీ వేడిగా చర్చ
- ఇప్పటికే కొండగట్టు, బెజవాడలో ప్రత్యేక పూజలు
- జనసేన నేతల్లో మెుదలైన సంబరాలు
దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టేందుకు ఇష్టపడి చేయించుకున్న వాహనం వారాహి. ఈ వారాహి ప్రజల్లోకి రాలేకపోయినప్పటికీ దీని చుట్టూ ఎన్నో వివాదాలు సైతం నడిచాయి. వాహనం కలర్‌పై వైసీపీ అభ్యంతరాలు సైతం వ్యక్తమయ్యాయి. అంతేకాదు వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. వాహనానికి సంబంధించి ఫోటో బయటకు విడుదలైనప్పుడు జరిగిన రచ్చను చూస్తే ఇది బయటకు వస్తుందా అని అంతా భావించారు. కానీ పురిటినొప్పులన్నీ దాటుకుని వాహనం బయటకు రావడం అన్ని అనుమతులు వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం కొండగట్టు, విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు సైతం వారాహికి చేయించారు పవన్ కల్యాణ్. అంతే ఇక వారాహి యాత్ర షురూ అనుకున్నారు. కానీ మళ్లీ బ్రేక్ వచ్చింది. దీంతో వారాహి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అయితే రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఇక ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వారాహి యాత్రను ప్రారంభించాలని భావిస్తున్నారు.ఇందుకోసం సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ రెండో వారం లేదా జూలై ఫస్ట్ వీక్‌లో వారాహి యాత్ర ప్రారంభం కాబోతుందని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.
గోదావరి జిల్లాల నుంచే ఆరంభం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను త్వరలో ప్రారంభించబోతున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రను ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించబోతున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. ఉత్తరాంధ్రలో ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతం అయ్యిందని ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభిస్తే మంచిదని పలువురు సూచించినట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం వారాహి యాత్రను ఉభయగోదావరి జిల్లాల నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఉభయగోదావరి జిల్లాలే రాజకీయాలకు సెంటిమెంట్ కావడంతో ఆ సెంటిమెంట్ ఆధారంగానే పవన కల్యాణ్ తన యాత్రను కొనసాగిస్తారని తెలుస్తోంది.
ఉభయగోదావరి జిల్లాలో జనసేనకు విపరీతమైన ఆదరణ ఉంది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల నుంచే జనసేన అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ప్రచారం ఉంది. అందుకు కాపు సామాజిక వర్గం అత్యధికం కావడం ఒకటైతే మరోకటి ఎన్నికల్లో గెలుపు ఓటములను సైతం నిర్ణయించేది కూడా కాపు సామాజిక వర్గం కాబట్టి. అంతేకాదు మెగా ఫ్యామిలీకి సైతం ఈ ఉభయగోదావరి జిల్లాలతో సన్నిహిత సంబంధాలు సైతం ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి మెగాస్టార్ చిరంజీవి జన్మించిన ఊరుకావడం...బంధువులు సైతం ఉండటంతో అక్కడ నుంచి యాత్ర ప్రారంభిస్తే ప్రారంభంలోనే విపరీతమైన జోష్ లభిస్తుందని జనసేన భావిస్తోంది. ఇందులో భాగంగా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఉభయగోదావరి జిల్లాలలో పవన్ పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ ఖరారు కాబోతుందని తెలుస్తోంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడి నుంచి వారాహి యాత్రను ప్రారంభించాలి.. ఇందులో ఎవరెవరు పాల్గొంటారు, యాత్ర రూట్ మ్యాప్ వంటి అంశాలపై జనసేన పార్టీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఉభయగోదావరి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పీఏసీ సభ్యులతో నాదెండ్ల మనోహర్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం భేటీ అయ్యారు. రూట్ మ్యాప్, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు. పవన్ యాత్రకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యాచరణ సిద్ధం చేశాక పవన్ యాత్రకు తేదీలు ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఆలస్యానికి కారణాలివేనా?
కొండగట్టు, బెజవాడ దేవాలయాలలో పూజలు అనంతరం వారాహి వాహనం మళ్లీ కనిపించలేదు.మంగళగిరి కార్యాలయంలో కూడా లేదు. ఎక్కడ ఉందో తెలియకపోవడంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు చేసింది. ఇక వారాహి యాత్ర ఆగిపోయినట్లేనని కూడా ప్రచారం చేశారు. అయినప్పటికీ దీనిపై అటు పవన్ కల్యాణ్ నుంచి కానీ ఇటు జనసేన పార్టీ నేతల నుంచి కానీ ఎలాంటి ఖండన రాలేదు. అయితే వారాహి యాత్ర ఆలస్యానికి నాలుగు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సినిమాలకు సంబంధించి డేట్స్ ఇచ్చేయడంతో నిర్మాత, దర్శకులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వరుస సినిమాలు చేస్తున్నారు.
అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అది కాస్త వాయిదా పడింది. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ప్రారంభించారు. దీనికి వారాహి యాత్ర పోటీ అవుతుందేమోననే సందేహాలు ఉండటంతో కాస్త నెమ్మదించినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ పెద్దలు జనసేన అధినేత పవన్‌ను నిలువరించారని.. రూట్ మ్యాప్ ఇవ్వలేదని ప్రచారం జరిగింది. బీజేపీ పెద్దలు ఇప్పుడే వద్దు అని చెప్పారని..అందుకే పవన్ కల్యాణ్ వారాహి యాత్రను పోస్ట్ చేశారని ప్రచారం జరిగింది.
లోకేశ్ యాత్రకు ఇబ్బంది లేకుండానే పవన్ యాత్ర ?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అనధికారికంగా పొత్తు కన్ఫర్మ్ అయిపోయిందని ఇక అధికారిక ప్రకటన తరువాయేనని ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే సీట్ల సర్ధుబాటుపైనా చర్చ జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు, అనంతపురం, కర్నూలు పూర్తి చేసుకుని వైఎస్ఆర్ కడప జిల్లాలో కొనసాగుతుంది. ఈ పాదయాత్ర శ్రీకాకుళంలోని ఇచ్చాపురంలో పూర్తయ్యేలా టీడీపీ రూట్ మ్యాప్ ఖరారు చేసింది.
దీంతో ఎక్కడ నుంచి వారాహియాత్ర ప్రారంభించాలనే దానిపై జనసేన తర్జనభర్జన పడింది. చివరకు సెంటిమెంట్ ప్రకారం పవన్ కల్యాణ్ ఉభయగోదావరి జిల్లాల నుంచి వారాహియాత్రను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లను సైతం సిద్ధం చేసినట్లు ప్రచారం. ఉభయగోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్రకు వెళ్తారా? లేక కోస్తాంధ్రలో పర్యటిస్తారా అనేది పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించనున్నారు. వారాహి యాత్ర ప్రారంభం కాబోతుందని ప్రచారం నేపథ్యంలో జనసైనికుల్లో నూతనోత్సాహం నెలకొంది.