బీజేపీ వలలో బాబు.. రిపబ్లిక్​ టీవీలో మోడీని ఆకాశానికి ఎత్తేసిన టీడీపీ అధినేత

by samatah |   ( Updated:2023-04-26 04:05:44.0  )
బీజేపీ వలలో బాబు.. రిపబ్లిక్​ టీవీలో మోడీని ఆకాశానికి ఎత్తేసిన టీడీపీ అధినేత
X

“ప్రధాని నరేంద్ర మోడీ వల్లే ఇండియాను ప్రపంచమంతా గుర్తిస్తోంది. మోడీ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన పబ్లిక్​, పీపుల్​, ప్రైవేట్​, పార్టనర్​ షిప్​(పీపీపీపీ) అద్భుతం. మోడీ తెస్సున్న మార్పులు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ప్రధాని అమలు చేస్తున్న విధానాలు మెరుగుపడితే 2050 నాటికి భారత్​దే అగ్రస్థానం. రూ.500 కన్నా పెద్ద నోట్లను రద్దు చేయాలని ప్రతిపాదిస్తున్నా. ఏపీలో పేదరికాన్ని అంతం చేయడమే నా లక్ష్యం !” అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రిపబ్లిక్​ టీవీ చానల్​ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రత్యేక హోదా సెంటిమెంటు వల్లే తాము ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు. బీజేపీ అనుకూల మీడియా చానల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బట్టి కమలనాథులతో టీడీపీ పొత్తుకు దారి సుగమం అయినట్లు కన్పిస్తోంది.

దిశ, ఏపీ బ్యూరో : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా చంద్రబాబు మౌనం వహించారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశనికెత్తుతూ బీజేపీ అనుకూల మీడియాలో మాట్లాడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కమలనాథులతో టీడీపీ పొత్తుకు రంగం సిద్దమైనట్లు ప్రచారం ఊపందుకుంది. బీజేపీతో పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం ఉన్నా లేకున్నా వైసీపీకి సహకరించకూడదనే ఎత్తుగడను చంద్రబాబు అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అంగీకరిస్తే జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడడం వల్ల కనీసం 30 నుంచి 40 సీట్లలో సానుకూల ఫలితాలుంటాయనే ఆలోచన కూడా ఉంది.

వైసీపీ తెరచాటు బంధం..

వైసీపీ ఎన్నడూ బీజేపీతో పొత్తుకు ప్రయత్నించలేదు. పొత్తు వల్ల జరిగే నష్టమేంటో సీఎం జగన్​కు బాగా తెలుసు. అందుకే ఇప్పటిదాకా ఆయన రహస్య బంధాన్నే కొనసాగించారు. పెట్రోలు, డీజిల్​, వంట గ్యాస్​ ధరలు పెంచినా, నిత్యావసరాలపై జీఎస్టీ పన్నులు బాదేస్తున్నా వాటన్నింటినీ కేంద్ర సర్కారు ఖాతాలోకి నెట్టి వైసీపీ చేతులు దులుపుకుంది. అర్బన్​, విద్యుత్​ రంగ సంస్కరణలకు తలూపినా, విభజన హామీలను నెరవేర్చకున్నా ఆ వ్యతిరేకత మొత్తాన్ని కేంద్రంపైకి తోసేసి వైసీపీ సర్కారు తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరించింది. చివరకు విశాఖ ఉక్కును తెగనమ్ముతామని కేంద్రం పదే పదే ప్రకటిస్తున్నా వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తూ ఆ సెగ తగలకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ నెత్తిన పాలుపోసినట్టేనని రాజకీయవర్గాల నుంచి వినిపిస్తోంది.

అదే జరిగితే..

ఈమధ్య వెలువడిన ఓ సర్వేలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి కడితే టీడీపీకే నష్టమని వెల్లడయింది. కేవలం జనసేనతో కలిస్తేనే టీడీపీ లాభ పడుతుందని తేలింది. జనసేన వల్ల వచ్చే సానుకూల ఫలితాలను బీజేపీ మీద వ్యతిరేకత మింగేస్తుందనేది సర్వే సారాంశం. రాష్ట్రంలో బీజేపీకి ఏమాత్రం సానుకూల పరిస్థితులు లేవు. విభజన హామీలు అమలు చేయని ఆ పార్టీని ప్రజానీకం ఈసడించుకుంటోంది. అయినా చంద్రబాబు బీజేపీ వైపు అడుగులు వేయడంపై తెలుగు దేశం పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బీజేపీ లేని జనసేన పొత్తుతోనే ప్రయోజనముంటుందనే కొంత క్యాడర్​ భావిస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం మైనార్టీలు దూరమవుతారనే ఆందోళన కూడా ఉంది.

బీజేపీ డబుల్ గేమ్..

వరుస పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న విశ్లేషకులు కొత్త కోణాన్ని ముందుకు తెస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు వైసీపీ మీద మరింత ఒత్తిడి పెంచడానికే చంద్రబాబుకు దగ్గరగా జరుగుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి గేమ్​ ఆడడంలో బీజేపీ అగ్రనేతలు ఆరితేరినట్లు పేర్కొంటున్నారు. ఈ డబుల్​ గేమ్​తో బీజేపీ తన ప్రయోజనాలకు అనుగుణంగా స్నేహ హస్తం చాస్తుందని విశ్లేషిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed