చంద్రబాబు జైల్లో ఉంటే ఎన్నికలను టీడీపీ ఎదుర్కోలేదా ?

by Hamsa |
చంద్రబాబు జైల్లో ఉంటే ఎన్నికలను టీడీపీ ఎదుర్కోలేదా ?
X

‘టీడీపీ అధినేత చంద్రబాబును ఎలాగైనా ఎన్నికల దాకా జైలులో నిర్బంధించాలి. ఆయన బయట లేకుంటే ఆ పార్టీ పనైపోయినట్లే...’ ఇదే వ్యూహంతో వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఆశ పడుతున్నదా ! చంద్రబాబు బెయిల్​ రద్దు చేయాలని సుప్రీం కోర్టుకు వెళ్లింది అందుకేనా ? ఇంతకీ, సీఎం జగన్​ కోరిక నెరవేరుతుందా అంటే సాధ్యం కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటిదాకా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్న అనుభవం టీడీపీకి ఉందనీ, ఆ పార్టీ నెట్​వర్క్​, క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం చాలా బలంగా ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీలోకి నాయకులు వస్తుంటారు.. పోతుంటారు. యంత్రాంగం మాత్రం చిత్తశుద్దితో పనిచేస్తుందని అనేకసార్లు రుజువైనట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత నుంచి ప్రజలను దారి మళ్లించడానికి అధికార పార్టీ ఆపసోపాలు పడుతోంది. ప్రధాన ప్రతిపక్ష నేతను ఏదో కేసులో జైల్లో పెడితే ఎన్నికల్లో తేలిగ్గా గట్టెక్కవచ్చని భావిస్తున్నట్లుంది. వాస్తవానికి తెలుగు దేశం పార్టీ అంత బలహీనంగా ఏమీ లేదు. ఎన్టీఆర్​ హయాం నుంచి అనేక సంక్షోభాలను ఎదుర్కొన్న అనుభవముంది. 2004లో ఓటమి తర్వాత టీడీపీ పనైపోయింది అనుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో తీవ్ర సంకట స్థితిని ఎదుర్కొంది. పదేళ్లలో మళ్లీ పుంజుకుంది. 2014లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. 2019 ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూసింది. జగన్​ దెబ్బకు ఇక టీడీపీ కోలుకోలేదనుకున్నారు. నాలుగున్నరేళ్లుగా వైసీపీ అనుసరిస్తున్న విధానాలు, ప్రతిపక్షాలపై ఎదురు దాడితో టీడీపీ మళ్లీ జవసత్వాలను ప్రోదిచేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అలాంటి కార్యకర్తలు టీడీపీకి వరం..

నాలుగు దశాబ్దాల క్రితం కాంగ్రెస్​ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన శక్తులు, వివిధ సామాజిక వర్గాల నుంచి టీడీపీ పురుడు పోసుకుంది. నాడు అభ్యుదయ భావజాలంతో తర్కంగా ఆలోచించగల నేతలు టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. వామపక్షాలతో సహచర్యం ద్వారా ఆయా పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలను టీడీపీ తనలో ఇముడ్చుకుంది. ప్రతి అంశాన్నీ తార్కికంగా ఆలోచించగల స్థాయికి పార్టీ శ్రేణుల్ని తీర్చిదిద్దింది. నాయకుడు నాయకత్వం వహించకపోయినా స్వతంత్రంగా చొరవ తీసుకొని లక్ష్యాన్ని ఛేధించే స్థాయికి పార్టీ యంత్రాంగం ఎదిగింది. పనిచేయని నేతలను పక్కకు నెట్టేసి ముందుకు దూసుకెళ్లే కార్యకర్తలు ఉండడం టీడీపీకి ఓ వరం. అందువల్ల చంద్రబాబు జైల్లో ఉన్నా.. బయట ఉన్నా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోగల సామర్థ్యం పార్టీ యంత్రాంగానికి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

లోపాన్ని సరిదిద్దుతూ..

తెలుగు దేశం పార్టీలో ఒకప్పుడు పూర్తిగా రాజకీయాలకు అంకితమై పనిచేసిన నేతలున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలను అంటిపెట్టుకొని ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి అలాంటి నేతల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఆర్థిక అవసరాల దృష్ట్యా వ్యాపార, పారిశ్రామికవేత్తలకు పార్టీలో పెద్దపీట వేస్తూ వచ్చారు. పార్టీ అధికారానికి వస్తే వీళ్లు ఎంజాయ్​ చేస్తారు. ప్రతిపక్షంలో ఉంటే మళ్లీ ఎన్నికలదాకా కనిపించరు. ప్రజా సమస్యలపై పోరాడలేరు. ఈ లోపాన్ని చంద్రబాబు గుర్తించారు. పూర్తికాలం రాజకీయాలకు అంకితమై పనిచేసే క్యాడర్​ను గమనించి, అలాంటి యువతకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నారు. పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా యువనేత నారా లోకేశ్​ ఇదే తరహాలో అడుగులు వేస్తున్నారు.

అసలుకే మోసం వస్తుందా..?

ఇలాంటి బలమైన పునాదులున్న తెలుగు దేశం పార్టీ చంద్రబాబు జైల్లో ఉన్నా.. బయట ఉన్నా ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోగలదని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రతి కార్యకర్తా ఓ నాయకుడిలా బాధ్యతలు భుజానికెత్తుకొని పనిచేస్తారు. చంద్రబాబుపై కేసులతో ఆ పార్టీ మరింత దృఢంగా మారింది. గత రెండు నెలల పరిణామాలే అందుకు నిదర్శనం. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని ఎంత కట్టడి చేయాలని వైసీపీ భావిస్తే.. అది రెట్టింపు వేగంతో పనిచేస్తుంది. అయినా ఇదే వ్యూహంతో వైసీపీ ముందుకెళ్తే విజయం సాధిస్తుందా.. అసలుకే మోసం వస్తుందా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story

Most Viewed