ఏపీ రాజకీయాలపై హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-01-19 10:25:12.0  )
ఏపీ రాజకీయాలపై హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాలపై హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మంచి చేసే వారినే ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. అలాగే డబ్బులకు ఓటును అమ్ముకోవద్దని తెలిపారు. అనంతపురం జిల్లా ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఎన్టీఆర్ తన వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని.. కానీ నేటి తరం నాయకుల్లా దోపిడీకి తెరలేపలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచుకోమని తన వారుసులకు ఎన్టీఆర్ చెప్పలేదని చెప్పారు. ఎన్టీఆర్ లాంటి నాయకులు ఈతరంలో లేరన్నారు. ఆయన చేసినన్ని సేవలు కూడా ఎవరూ చేయలేదని తెలిపారు. టికెట్ల వ్యవహారంలో సూటు కేసులు ఇవ్వని వరకూ రాజకీయాల్లో మార్పులు రావని పేర్కొన్నారు. దొంగ ఓట్లపై ప్రజలే నిలదీయాలని సూచించారు. బిడ్డల భవిష్యత్తును ఆలోచించి ఓటు వేయాలని శివాజీ పిలుపునిచ్చారు.

అయితే హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు వైఎస్ జగన్ ను ఉద్దేశించినవిగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మరోవపు శివాజీపై పలువురు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ తన నాయకుడిపై శివాజీ విమర్శలు చేశారని.. ఇప్పుడూ తమ నాయకుడి ఉద్దేశించే ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు. తమ నాయకుడిని కించపర్చేలా మాట్లాడటం తగదని సూచించారు. ఎవరైనా తన నాయకుడిపై లేని పోని ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

కాగా టీడీపీ హయాంలో గరుడపురాణం చెప్పి రాష్ట్రవ్యాప్తంగా హీరో శివాజీ సంచలనంగా మారారు. రాష్ట్రాన్ని కొందరు నాశనం చేయాలని చూస్తున్నారని, ప్రత్యేక హోదా రానివ్వకుండా అడ్డుకుంటున్నారని చెప్పి కలకలం రేపారు. అయితే అప్పుడు కూడా ప్రతిపక్ష నేత జగన్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో శివాజీ సైలెంట్ అయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు వస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని.. అయితే డబ్బులు తీసుకోవద్దని శివాజీ తాజాగా పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed